ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ కూడలి అయిన చౌటుప్పల్ జంక్షన్ విస్తరణను ప్రభుత్వం ఉన్నపళంగా 78 ఎకరాల నుంచి 181 ఎకరాలకు పెంచింది. ఎందుకోసం అనేదానిపై స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ.. ఏపీ వెళ్లే ప్రయాణికుల కోసం మాల్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తున్నది. అందుకు భూముల కోసం పేద రైతులను బలిపెడుతున్నది.
ట్రిపుల్ ఆర్ ఇంటర్చేంజ్ కోసం గత ప్రభుత్వం 78 ఎకరాలకే ప్లాన్ పరిమితం చేసింది. కానీ దాంతోపాటు రిఫ్రెష్మెంట్ హబ్‌గా మార్చడానికి రేవంత్ సర్కార్ 181 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొందరి వినోదం కోసం తమను బజారున పడేయటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కొత్త అలైన్మెంట్తో చౌటుప్పల్ పట్టణం రెండుగా చీలనున్నది. ప్లాన్ మార్పుతో రెండున్నర రెట్లు అధికంగా రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపైనా భూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలైన్మెంట్ మార్పులు తమకు తెలియవంటూ మంత్రి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దాగుడుమూతలు ఆడుతుండటంపై వారు మండిపడుతున్నారు.
RRR | నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని చూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా అటుఇటు మార్చుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఉత్తర-దక్షిణ భాగాలు కలిపేచోట ట్రిపుల్ ఆర్ జంక్షన్‌ను విస్తరించడం కలకలం రేపుతున్నది. ఇక్కడ జంక్షన్ విస్తరణ ఏరియా ఉన్నట్టుండి రెండున్నర రెట్లకు పెరగడం గమనార్హం. ఫలితంగా ఇప్పటికే కోట్లల్లో విలువ చేసే వ్యవసాయ భూములతోపాటు లక్షల విలువైన ప్లాట్లు, ఇండ్లు పోనున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులు, సామాన్య ప్రజలు రెండు నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ఇలా ఎవరు కనిపిస్తేవారిని తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. వీరి ఆవేదనకు, ఆక్రోశానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
చౌటుప్పల్ పట్టణానికి ఆనుకుని తూర్పు వైపున హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రీజినల్ రింగ్ రోడ్డులో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపే జంక్షన్‌ను ప్రతిపాదించారు. దాదాపు ఈ జంక్షన్ చౌటుప్పల్ మున్సిపాలిటీ మధ్యలోనే ఏర్పాటు కానుంది. గతంలో ఉత్తర భాగం అలైన్మెంట్ ఖరారు చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జంక్షన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దక్షిణభాగం అలైన్‌మెంట్‌ను ఈ జంక్షన్‌కు అనుసంధానం చేస్తూ ముందుకు కొనసాగించనున్నారు. అయితే ఈ సమయంలో ఇక్కడ వాహనాల ఇంటర్ చేంజ్ వ్యవస్థ కోసం, సర్వీసు రోడ్లు తదితర అవసరాల కోసం 78 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని ప్రకటించింది. ఆ ప్రకారమే క్షేత్రస్థాయిలో అప్పట్లోనే సర్వేబృందాలు మార్కింగ్ కూడా చేసి స్థానికులకు స్పష్టతనిచ్చాయి. దీనివల్ల కొంతమొత్తంలో వ్యవసాయ భూములతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని ప్లాట్లు, ఇండ్లు కూడా పోతున్నాయి. ఇందులో భూములు, ప్లాట్లు పోతున్న వారిలో కొంత మంది ముందే ప్రతిపాదిత జంక్షన్ ఏరియా దాటి ఇండ్ల కోసం ప్లాట్లు కొనుగోలు చేయడం, వాటిల్లో తిరిగి ఇండ్ల నిర్మాణాలను మొదలు పెట్టడం చేశారు. కానీ ఉన్నట్టుండి ఈ జంక్షన్ ఏరియా రెండింతలకు పైగా పెరగడంతో తీవ్ర అలజడి మొదలైంది. దీనివల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా రెండుగా చీలిపోనున్నది. 1,2,3 వార్డుల పరిధిలోని లింగారెడ్డిగూడెం, తాళ్లసింగారం, లింగోజిగూడెం ట్రిపుల్ ఆర్కు మరోవైపు విడిపోనున్నాయి.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో జంక్షన్ పరిధి పెంచడంతో ప్లాట్లు, ఇండ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్న నిర్వాసితులంతా గత కొద్ది రోజులుగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడి నిరసనకు దిగారు. పలుమార్లు జంక్షన్ ఏరియాతో పాటు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టారు. భువనగిరి కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా బాధితుల తరఫున కలెక్టర్‌ను కలిశారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, స్థానిక ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని సైతం బాధితులు పలుమార్లు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి వెంకట్‌రెడ్డి లాంటి పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
చౌటుప్పల్ వద్ద తలపెట్టిన జంక్షన్ విస్తరణ ఉన్నట్టుండి భారీగా పెరిగింది. వచ్చే 50 ఏండ్ల అవసరాలను దృష్టి పెట్టుకుని ఈ జంక్షన్ వద్ద అత్యాధునిక వసతులతో కూడిన మల్టీప్లెక్స్‌లు, హోటళ్లు, టెర్మినల్స్ లాంటివి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఇప్పుడే భూసేకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో రెండేండ్ల కిందటే ఇక్కడ ఓఆర్ఆర్ తరహాలోనే ఇంటర్ చేంజ్ వ్యవస్థ కోసం 78 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయిలో భూసర్వే పూర్తి చేసి మార్కింగ్ కూడా చేశారు. తాజాగా దక్షిణ భాగం రింగ్‌రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న భావిస్తూ ఆ మేరకు అలైన్మెంట్లో సైతం జోక్యం చేసుకుంటున్న విషయం తెలిసిందే. దక్షిణభాగంలో గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అలైన్‌మెంట్‌ను కాదని రాష్ట్ర ప్రభుత్వ ‘సొంత’ అవసరాల పేరిట అటుఇటు మార్పులకు సిద్ధపడింది. అందులో భాగమే చౌటుప్పల్ వద్ద జంక్షన్ విస్తరణ కూడా అన్న చర్చ సాగుతున్నది. జంక్షన్ విస్తరణ ఏరియాను పెంచడం వల్ల కోల్పోతున్న వ్యవసాయ భూములు, ప్లాట్ల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ప్రయాణించేవాళ్ల విందులు, వినోదాల కోసం తమ భూములు లాక్కోవడం ఏమిటని స్థానిక రైతులు, ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. జంక్షన్ అంటే వాహనాల ఇంటర్ చేంజ్, టోల్‌ప్లాజాల లాంటివి సర్వసాధారణం. కానీ ట్రిపుల్ ఆర్‌లో ఇతర జంక్షన్ల వద్ద ఎక్కడా లేనివిధంగా హోటళ్లు, టూరిజం ప్లాజాలు, టెర్మినల్స్, మల్టీప్లెక్స్ల్లాంటి అదనపు సౌకర్యాల కోసం ఒక్కసారిగా 181 ఎకరాలకు జంక్షన్ ఏరియాను పెంచడం ఎంతవరకు సబబు అని వారు నిలదీస్తున్నారు. ఏపీ ప్రయాణికుల ఆనందం కోసం తమను బలిచేయడం సరికాదంటున్నారు. దశాబ్దాల తరబడి భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, అలాంటి భూములను ఎవరి సౌకర్యాల కోసమో లాక్కోవడం ప్రభుత్వ పెద్దలకు సరికాదని వారు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి లాంటి వారంతా అలైన్మెంట్లో పోతున్న భూముల విస్తీర్ణం మరింత తక్కువగా ఉండేలా చూస్తామని, ఆ భూములకు కూడా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇప్పిస్తామని నమ్మబలికారని బాధిత రైతులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త అలైన్మెంట్ పేరుతో రెండున్నరరెట్లు ఎక్కువగా భూములను లాక్కుంటున్నారని, దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మొహం చాటేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
హైవేకు దక్షిణభాగంలో జంక్షన్ పరిధిని పెంచడం వల్ల తంగడపల్లికి చెందిన జాల అనే ఇంటి పేరు కలిగిన యాదవ కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూమి ముప్పావు వంతు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జాల కుటుంబంలో పూర్వీకుల నుంచి వస్తున్న వారసత్వ భూమి 110 ఎకరాల ఉండగా దీని ఆధారంగా ప్రస్తుతం 35 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గతంలో 2009లో హైవే విస్తరణలో కొంత భూమిని వీరు కోల్పోయారు. గతేడాది కిందట సోలార్ పవర్, దివీస్ ల్యాబ్, ఏపూరు వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు టవర్ల కోసం వీళ్లే మరికొంత భూమిని కోల్పోయారు. ‘పాత అలైన్మెంట్ ప్రకారం 35 ఎకరాల వరకు భూమి పోతుండె. సగం పోయినా.. సగం భూమైనా మిగులుతుందని అనుకున్నం.
కానీ జంక్షన్ పరిధి పెంచడంతో కొత్త మార్కింగ్‌లను బట్టిచూస్తే సుమారు 80 ఎకరాల వరకు భూమి పోతున్నది. జాల ఇంటిపేరున్నవారిలో సగం కుటుంబాలకు చెందిన భూమి మొత్తం ఇందులోనే పోతున్నది’ అని జాల శ్రీశైలం వాపోయారు. ఇక్కడ ఎకరం భూమి రూ.3 కోట్ల నుంచి 4కోట్ల వరకు ఉన్నదని, ప్రభుత్వం రూ.35లక్షలు ఇస్తే ఎట్లా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఎకరం డబ్బులు పెడితే ఇదే చౌటుప్పల్‌లో 150 గజాల ప్లాటు కూడా వచ్చే పరిస్థితి లేదని జాల అంజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా జాల వారి కుటుంబంలో ప్రతిఒక్కరూ జంక్షన్ విస్తరణ బాధితులే కావడం గమనార్హం. కొద్దికాలంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పలువురు ప్లాట్ల యజమానులు కంటతడి పెట్టారు. పాత ప్లాన్ ప్రకారం 78 ఎకరాల్లోనే జంక్షన్ నిర్మాణం చేపడితే బాధితుల సంఖ్య తగ్గి, వారికి కొంత భూమైనా మిగులుతుందని వారు వాపోతున్నారు.
తాజా మార్పులు చేర్పుల తర్వాత చౌటుప్పల్ జంక్షన్‌ను హైవేకు ఇరువైపులా 1,350 మీటర్ల పొడవునా ‘డంబెల్’ ఆకారంలో నిర్మాణం కానున్నది. దీనివల్ల రెండువైపులా కలిపి అదనంగా రైతుల నుంచి 103 ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తున్నది. ఫలితంగా భూబాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రెండునెలల కిందట గుట్టుచప్పుడు కాకుండా సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. సర్వే బృందాలు భూ యజమానులతో సంబంధం లేకుండా మార్కింగ్ చేయడం మొదలుపెట్టాయి. తంగడపల్లి శివారులోని వ్యవసాయ భూముల్లో కొత్తగా సర్వే చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు.. వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసు బృందాలను వెంటేసుకుని రైతులను బలవంతంగా అక్కడి నుంచి తరలించి సర్వేను కొనసాగించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పాత అలైన్మెంట్ ప్రకారం భూములు తీసుకుంటే తమ భూముల్లో కొంతైనా మిగిలేదన్నది రైతుల వాదన. కొత్త అలైన్మెంట్, జంక్షన్ విస్తరణ వల్ల తమకున్న భూములు, ప్లాట్లన్నీ ఇందులోనే పోతున్నాయని రైతులు వాపోతున్నారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములే తమకు జీవనాధారమని, ఉన్న భూమంతా జంక్షన్ పేరుతో లాక్కుంటే తామెలా బతకాలని వారు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పేదల పక్షాన నిలుస్తాయని కొంతలో కొంత వామపక్షాలకు పేరుండేది. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో వారి వైఖరి కూడా మారింది. ప్రజాపోరాటాలు పక్కకు వెళ్లిపోయాయి. ఒకనాడు ప్రపంచబ్యాంకుపై యుద్దం చేసిన వామపక్షం.. ఇప్పుడు ముఖ్యమంత్రి అదే పాట పాడినా కనీసం వ్యతిరేకించడం లేదు. అలాగే చౌటుప్పల్ రైతులను బజారుపాలు చేస్తున్న జంక్షన్ విస్తీర్ణం మార్పుపైనా వారు పెదవి విప్పడంలేదు. శనివారం ఏచూరి సంస్మరణ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరిన సీపీఎం నేతలు.. తర్వాత ఆయనను కలిశారు. చౌటుప్పల్ భూబాధితుల సమస్యను ప్రస్తావించారు. ‘నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు వెనక్కి పోలేం. కావాలంటే రైతులకు పరిహారాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీఎం రేవంత్ సమాధానమిచ్చారట. ఆ తర్వాత కూడా వారి నుంచి నిరసన స్వరం వినిపించలేదు. కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు. ఎప్పటిలాగే వామపక్షం మౌనంగానే ఉండిపోయింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్రిపుల్ఆర్ ఉత్తరభాగం అలైన్మెంట్, సర్వే సమయంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచేవారు. రాయగిరి ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తుంటే వెళ్లి మరీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మార్చడంతోపాటు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇస్తామని నమ్మబలికారు. కానీ నేడు రాయగిరి రైతులకు ఆయన ముఖం చాటేశారు. తీరా ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ‘సొంత’ అవసరాల పేరు ట్రిపుల్ ఆర్ సౌత్‌లో అలైన్మెంట్ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో చౌటుప్పల్ జంక్షన్ విస్తరణ బాధితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పలుమార్లు కలిసే ప్రయత్నం చేశారు. ఓసారి నల్లగొండలో, పలుమార్లు హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్తే గంటలకొద్దీ వేచి ఉన్నా కనీసం కన్నెత్తి చూడలేదని బాధితులు వాపోతున్నారు. ఒకసారి ఆయన చౌటుప్పల్ మీదుగా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కలిశామని వారు చెప్పారు. ‘ట్రిపుల్ ఆర్ అంతా సీఎం రేవంత్‌రెడ్డే చూస్తున్నడు.
నాకేం తెల్వదు. మీకు కావాలంటే ఆయననే కలవండి’ అంటూ ఆగకుండా వెళ్లిపోయాడని బాధితులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పలుమార్లు కలిసిన బాధితులకు నిరాశే ఎదురైంది. ‘అలైన్మెంట్లో మార్చడం మన చేతుల్లో ఉండదు. మార్చేందుకు నేనేమో మంత్రిని కాదు. కలెక్టర్‌కు చెప్పి కేంద్రానికి లేఖ రాపిద్దాం. బహిరంగ మార్కెట్ రేట్ కోసం నా వంతు ప్రయత్నం చేస్తా’ అంటూ కలెక్టర్‌కు ఫోన్ చేసి చేశారని బాధితులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓట్ల కోసం ఎకరానికి కోటి రూపాయల వరకు పరిహారం ఇస్తామని కూడా చెప్పినట్టు ట్రిపుల్ఆర్ బాధితులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ తమ గోడును వినిపించుకోవడం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ భూదందాకు సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేయండి : 91827 77711
నాకు ఇద్దరు బిడ్డలు. ఉన్నది ఒకటే ఎకరం. వారికి పెండ్లిళ్లు చేసి కట్నం కింద భూమి ఇస్తానని చెప్పిన. ఉన్న భూమి ఇప్పుడు రింగ్ రోడ్డు కింద పోతున్నది. ఏమి చేయాలో అర్థమైతలేదు. భూమి పోతే సచ్చిపోవుడే. నా బిడ్డలకు ఏంచెప్పాల్నో అర్థమైతలేదు. ఇల్లు ఒకటే మిగుల్తది. దాన్ని కూడా అమ్మితే ఇగ రోడ్డు మీద ఉండాల్సిందే.
-మార్గం మల్లయ్య, రైతు, చౌటుప్పల్