హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. ఆదివారం సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తాము ప్రారంభించిన యంగ్ ఇం డియా సిల్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేసి ఐటీఐలకు అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేం ద్ర మంత్రికి తెలియజేశారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తిచేశారు. అంతకుముందు మంత్రి ఎన్సీఈఆర్టీని సందర్శించారు.
ఆరు ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం ; సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎంవోయూలు
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పలు ఎన్జీవోలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకున్నది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎన్జీవోల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్ టెక్ సదుపాయాలను ప్రభుత్వం అందించనున్నది. నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతాకృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది.