హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జైళ్లశాఖపై ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టు కోల్పోతున్నారు. ఆ శాఖలో ఏం జరుగుతున్నదో కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. గత రెండేండ్లుగా కొనసాగుతున్న ఇంచార్జుల పాలనలో జైళ్లశాఖ అస్తవ్యస్తమైంది. కనీసం 10 మంది ఖైదీలైనా లేని జైలులో ఏకంగా ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారిని ఖాళీగా కూర్చోబెడుతున్న ప్రభుత్వం.. వందల మంది ఖైదీలున్న జైళ్లకు సూపరింటెండెంట్లను నియమించడం లేదు.
అలా ఓ ఉన్నతాధికారి హయాంలో రెండు చోట్ల ఖైదీలు పారిపోయినా, మరోసారి ఖైదీ రాంగ్ రిలీజ్ అయినా ఆ వ్యక్తినే ఉన్నత పదవిలో కొనసాగిస్తున్నారు. జిల్లా జైళ్లలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వాటి ఆలనా పాలనా చూడాల్సిన ఉన్నతాధికారులు కేవలం సమీక్షలతో సరిపెడుతూ తమ సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. దీనిపై మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా ముఖ్యమంత్రికి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, ఇతర ఉన్నతాధికారులకు చీమకుట్టినట్టయినా లేదని జైళ్లశాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఓ సెంట్రల్ జైలులో కేవలం 10 మంది ఖైదీలే ఉన్నట్టు సమాచారం.
కానీ, పది మందికే ఒక సూపరింటెండెంట్, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, అవసరానికి మించి కింది స్థాయి సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. ఆ జైలులో పనిచేస్తున్న ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లలో ఒకరు సంగారెడ్డికి అచాట్ అయినట్టు వినికిడి. దాదాపు 630 మంది ఖైదీలున్న సంగారెడ్డి జైలులో ప్రస్తుతం ఒక సూపరింటెండెంట్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఉండాల్సిన డిప్యూటీ సూపరింటిండెంట్‌ను 10 మంది ఖైదీలున్న చోటికి పంపి ఖాళీగా కూర్చోబెడుతున్నారు. కేవలం 10 మంది ఖైదీలున్న జైలులో ఓ ఎస్పీ ర్యాంకు అధికారి, ఇద్దరు డీఎస్పీ ర్యాంకు అధికారులు ఈగలు తోలుకుంటూ కూర్చుకుంటున్నారని, వారిని ఎక్కువ మంది ఖైదీలున్న జైళ్లకు సర్దుబాటు చేయాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది చెప్తున్నారు.
640 మందికిపైగా ఖైదీలున్న జైలుకు ఇంచార్జిగా కిందిస్థాయి అధికారి
ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో 640 మందికిపైగా ఖైదీలున్న ఓ సెంట్రల్ జైలుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ జైలుకు దాదాపు 10 నెలల నుంచి సూపరింటెండెంట్ స్థాయి అధికారి లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన శాఖాపరమైన బదిలీల్లోనూ ఉన్నతాధికారులు ఆ జైలుకు సూపరింటెండెంట్‌ను కేటాయించలేదు. అంత పెద్ద జైలు నిర్వహణ బాధ్యతలను ఇంచార్జి అధికారికే కొనసాగిస్తుండటంతో వందల మంది ఖైదీలతోపాటు అక్కడి సిబ్బంది సంక్షేమం, భద్రత గాలిలో దీపంలా మారింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా జైళ్లలో డిప్యూటీ సూపరింటెండెట్ స్థాయి అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ప్రస్తుతం జైలర్, ఇంచార్జిలే నిర్వహిస్తున్నారు.
నచ్చినవారికే అందలం
రాష్ట్ర జైళ్లశాఖలో కొందరు అధికారులకు ప్రైమ్ ఏరియాల్లో పదే పదే పోస్టింగ్‌లు లభిస్తున్నాయి. ఉన్నతాధికారులకు నచ్చినవారిని అందలమెక్కించడం, నచ్చనివారిని దూరపు జిల్లాలకు పంపడం పరిపాటిగా మారింది. అర్హతలు, అనుభవం ఉన్నవారిని పకన పెట్టి ఇంచార్జిల వ్యవస్థను ప్రోత్సహిస్తుండటంతో నిజాయితీగా పనిచేసే అధికారుల మనోధైర్యం దెబ్బతింటున్నది. ఇది జైళ్ల భద్రతపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది.