NREGA | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని, ఇందుకు తమ దుస్థితే నిదర్శనమని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలతో పనులు చేయించడం, సకాలంలో వేతనాలు అందించడంలో సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తారు. క్రమం తప్పకుండా కూలీలతో పనులు చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులు రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.
ఉపాధి కూలీలకు ఎంత ఎక్కువగా పనులు కల్పిస్తే అంత భారీ మొత్తంలో నిధులు విడుదలవుతాయి. కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించే బాధ్యతలో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక భాగస్వాములు. వారికి నెలకు రూ.10 వేల వేతనం. ఉపాధి పనుల్లో హరితహారం, డంపింగ్ యార్డులు, నీటినిల్వ పనులు, పండ్లతోటల పెంపకం, నర్సరీల నిర్వహణ, చెరువుల్లో పూడికతీత వంటి పనులను పర్యవేక్షిస్తుంటారు. ఇంత చేస్తున్నా సకాలంలో వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమగోడును మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో అదనపు ప్రాజెక్టు అధికారులు 2006 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగానే పనిచేస్తున్నారు. తమను టార్గెట్లు విధిస్తూ పనిభారం పెంచుతున్న ప్రభుత్వం పేస్కేల్ అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏపీవోలు మండిపడుతున్నారు. 2024 ఫిబ్రవరి 2న రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఏపీవోలకు పే స్కేల్ అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది దాటినా మంత్రి సీతక్క ఇచ్చిన హామీ అమలుకాలేదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఏటా కేంద్రం ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయిస్తుంది. ఇందులో 60 శాతం కూలీలకు, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు కేటాయిస్తారు. తాజాగా రూ.3,000-4000 కోట్లు సీసీ రోడ్లు, బిల్డింగ్ నిర్మాణాలకు కాంపోనెంట్ నిధులు కేటాయించారు. ఇందులో మాకు కేవలం రూ.100 కోట్లు కేటాయిస్తే ఏడాదిపాటు వేతనాలు అందుతాయి. ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ను కలిసి వేడుకున్నాం. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు చెప్పారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే బడ్జెట్ విడుదల చేయాలి.