తిమ్మాజిపేట, డిసెంబర్ 14 : నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఎన్నికల కోసం వచ్చిన సిబ్బంది రిసెప్షన్ సెంటర్ వద్ద ఎన్నికల సామగ్రిని అందజేసిన అనంతరం ఆదివారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. రిసెప్షన్ కేంద్రం నుంచి మండల కేంద్రానికి 2 కి.మీ దూరం ఉందని, తాము ఎలా వెళ్లాలని అక్కడే గేట్లు మూసి వేసి ధర్నా నిర్వహించారు. తాము కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి డివిజన్లలోని సొంత గ్రామాలకు వెళ్లాలని, ఇంత రాత్రి వేళ రవాణా సౌకర్యం లేకపోతే ఎలా వెళ్తామని ప్రశ్నించారు. తమ డివిజన్ల వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, అంతేకాకుండా పూర్తి స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని పట్టుబట్టారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది స్థానిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.