(రంగనాథ్ మిద్దెల) హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతూ కేసీఆర్ పాలనలో పునర్వైభవం పొందిన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహుడి విదేశీ కల్యాణాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆచారాలకు నీళ్లొదిలి.. అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏటా విదేశాల్లో కల్యాణం పేరుతో వెళ్తున్న అర్చక సిబ్బంది అక్కడ ఎన్ని కల్యాణాలు చేస్తున్నారు? అసలు కల్యాణాల్లో పాల్గొన్న వారెందరు? అనే లెక్కలు చూపడం లేదు.
స్వామివారి కల్యాణోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నామన్న సాకు చూపి దేవాలయ సిబ్బంది నెలల తరబడి విదేశాల్లో జల్సాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో కల్యాణ కార్యక్రమం దేవస్థానంలోని కొందరు సిబ్బందికి డాలర్ల పంట పండిస్తున్నదని ఆలయవర్గాలే పేర్కొంటున్నాయి. దేవుడికి ఇచ్చే ముడుపులు, మొక్కుబడులు, డబ్బులు, డాలర్లు, బంగారం కొందరి ఖాతాల్లోకే చేరుతున్నాయని చెప్తున్నాయి.
విదేశీ కల్యాణాల పేరుతో ఆన్‌డ్యూటీపై అర్చకులు, సిబ్బంది ఇతర దేశాలకు వెళ్లి అక్కడ కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. నిరుడు ఆగస్టులో కెనడా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు, సెప్టెంబర్‌లో కల్యాణోత్సవాలు నిర్వహించారు. విండ్సర్, ఒట్టావా, మాంట్రియల్, వాన్కోవర్, బ్రాంప్టన్‌లో కల్యాణాలు జరిపించారు. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు సామూహికంగా ఆలయంలోనో, ఓ ఫంక్షన్హాల్లోనో నిర్వహించుకున్నారు. అయితే ఇవన్నీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగగా, పలుచోట్ల కొందరి ఇండ్లలో కల్యాణాలు నిర్వహించారంటూ దేవస్థాన సిబ్బంది చెప్తున్నారు.
స్వామివారి చరమూర్తులను తీసుకెళ్లి ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వారి ఇండ్లలో పెట్టి కల్యాణం చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. యునైటెడ్కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు యూరప్ దేశాల్లోనూ కల్యాణాలు నిర్వహించారు. మిల్టన్ కేన్స్, వేల్స్, స్కాట్లాండ్, లీసిస్టర్, గ్లౌసెస్టర్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బర్మింగ్‌హామ్, ఈస్ట్ లండన్‌లో సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 23వరకు కల్యాణాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఆ అసోసియేషన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది. ఈ పర్యటనలో మొత్తం పదిచోట్ల కల్యాణాలు జరిపించారు.
విదేశాల్లో నిర్వహించే కల్యాణాల్లో ఉపయోగించే లక్ష్మీనరసింహస్వామి చరమూర్తులను ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లొచ్చు. స్వామి వారి వైభవాన్ని దేశ, విదేశాల్లో ఉన్న తెలుగులోగిళ్లకు తీసుకెళ్లాలన్న సత్సంకల్పంతో వీటిని రూపొందించారు. కానీ ఇప్పుడా మూర్తులకు అపచారం జరుగుతున్నది. వైష్ణవాగమ సంప్రదాయం ప్రకారం పెరుమాళ్లను ఎవరుపడితే వారు ఇష్టంవచ్చినట్టు తాకరాదు.. అందులోనూ మడికట్టుకోకుండా ముట్టుకోరాదు. కానీ యాదగిరి లక్ష్మీనృసింహుడి విదేశీ కల్యాణాల్లో ఈ సంప్రదాయాలకు నీళ్లొదిలారు. ఎవరైనా భక్తులు డబ్బులిస్తే చాలు.. చరమూర్తులను వారికే అప్పగించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చర మూర్తులైనా, ఏ విగ్రహాలైనా వాటి పవిత్రతను కాపాడాల్సిన వారే అనాచారంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. కెనడా, లండన్‌లో జరిగిన కల్యాణాల్లో చాలావరకు ఇలాగే వ్యవహరించారంటూ ఆలయంలో చర్చ జరుగుతున్నది. స్వామివారి ఉత్సవ మూర్తిని ఏకంగా కారులో సీటు బెల్ట్ పెట్టి తీసుకెళ్తున్న ఫొటో, ప్యాంటూ షర్ట్ వేసుకుని దేవుడిని పట్టుకున్న ఫొటోలు వైరల్ కావడంతో భక్తులు మండిపడుతున్నారు.
రెండేండ్లుగా జరిగిన విదేశీ కల్యాణాల్లో వచ్చిన ఆదాయంలో రూపాయి కూడా దేవస్థానానికి జమచేయలేదని ఆలయ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నది. డాలర్ల రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని, దాన్ని అధికారులే పంచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో కల్యాణాలు జరిగే సమయంలో ఉత్తరీయాలు, స్వామివారి నాణేలు, ప్రసాదాలు వితరణ చేస్తుంటారు.

అసలు దేవస్థానం నుంచి ఎన్ని తీసుకెళ్తున్నారు? ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని కల్యాణాలు జరిగాయి? వీటి ద్వారా వచ్చిన ఆదాయమెంత? అనే లెక్కలు చూపడం లేదని, ఎవరైనా అడిగితే నయానో, భయానో లొంగదీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి రూపాయి జమచేయకుండా విదేశాలకు వెళ్లిన వారు తమ జేబులు నింపుకొంటున్న విషయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.
దేవస్థానంలో సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి వరకు ఎదిగిన ఓ అధికారి విదేశీ కల్యాణాల్లో తన చేతివాటం చూపినట్టు దేవాదాయశాఖకు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గతంలోనే యాదగిరిగుట్టలో పనిచేసే అధికారుల అక్రమాలపై నివేదిక కోరారు. ఇదంతా బయటకు రాకుండా గప్‌చుప్‌గా శాఖలోనే అంతర్గతంగా వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్టు సమాచారం. ఆ అధికారి స్థానికుడు కావడంతో సంస్థాగత నివేదికలు మొదలుకొని అన్ని అంశాల్లో ఆయన చెప్పిందే వేదంగా దేవస్థానంలో నడుస్తున్నదని ఆలయ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
విదేశాల్లో కల్యాణాలు నిర్వహించే క్రమంలో అక్కడ ఎన్నో రకాల లాభాలు ఉంటాయని, దాదాపు ప్రతి విదేశీయాత్రలో తన పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకునే ఈ అధికారి వ్యక్తిగతంగా డాలర్ల పంట పండించుకున్నారనే చర్చ జరుగుతున్నది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను విదేశాలకు తీసుకెళ్లి అక్కడ జరిపే కల్యాణాల్లో అర్చకులకు దిశానిర్దేశం చేస్తూ తనకు అనుకూలమైన ఇండ్లలో కల్యాణాలు జరిపించడంలో ఈ అధికారి కీలకపాత్ర పోషించారని దేవస్థానంలో చెప్పుకొంటున్నారు. విదేశాల్లో కొన్నింటికి ప్రభుత్వ అనుమతులు,
మరికొన్నింటికి అనుమతులు లేకుండా ఇంటింటి కల్యాణాలు, వాడవాడలా ఉత్సవాలు నిర్వహించి స్వామి వారి హుండీకి చెందాల్సిన డాలర్లన్నీ తన జేబుల్లోకి మళ్లించారని చర్చ జరుగుతున్నది. ఇలా ఆ అధికారి యాదగిరి గుట్టలో కట్టుకున్న సొంత ఇంటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానికుడైన ఆ అధికారికి అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు భారీగా ఉండటంతో ఆ అధికారితో పాటు మరో అధికారి అక్రమార్జన, ఆదాయానికి మించిన ఆస్తులపై సాక్షాత్తు మంత్రే గతంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించాలంటూ ఆశాఖ ఉన్నతాధికారులకు చెప్పినా అడుగులు పడలేదని సమాచారం.
గత అక్టోబర్‌లో ఇద్దరు అధికారుల అవినీతి, అక్రమాల బాగోతంపై దేవాదాయశాఖ ప్రధాన ఉన్నతాధికారి యాదగిరి గుట్ట ఆలయ ఈవోను నివేదిక కోరారు. అయినా ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదు. తమపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, శాఖాపరంగా ఏదైనా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రయత్నించినా ఆ అధికారి మాత్రం తన మిత్రుడైన ప్రజాప్రతినిధి సహకారంతో అన్నింటినీ మేనేజ్ చేస్తూ బయటపడుతున్నాడని దేవాదాయశాఖలో చర్చ నడుస్తున్నది.