బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 02:42:34

టెన్త్‌ పరీక్షలు వాయిదా

టెన్త్‌ పరీక్షలు వాయిదా

  • నేటి పరీక్ష యథాతథం
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదావేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 23 (సోమవారం) నుంచి ఈ నెల 30 వరకు జరుగనున్న పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్‌ చేయాలని స్పష్టంచేసింది. అయితే ఈ నెల 21న (శనివారం) జరుగనున్న పరీక్షను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. కరోనా వైరస్‌ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని, అందువల్ల పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం బాలకృష్ణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కే పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ కేంద్ర బోర్డులైన సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ నిర్వహించే పరీక్షలను ఇప్పటికే వాయిదా వేశాయని తెలిపారు. 

కరోనా నేపథ్యంలో విద్యార్థులు చదువులపై దృష్టి సారించలేకపోతున్నారని చెప్పారు. పరీక్షలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలన్న తమ     నిర్ణయాన్ని ఎస్సెస్సీ బోర్డు పునఃపరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ చర్యలు లేవని, తల్లిదండ్రులు భారీసంఖ్యలో గుమిగూడుతున్నారని తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం.. సోమవారం నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.     శనివారం నాటి పరీక్ష కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసినందున ఆ పరీక్షను కొనసాగించేందుకు అనుమతించింది. ఈ నెల 29న హైలెవల్‌ కమిటీ నేతృత్వంలో కరోనా వైరస్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించి.. పరీక్షల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని  ధర్మాసనం తెలిపింది. 

దుఃఖాన్ని దిగమింగుకొని

తమ ఆప్తులను కోల్పోయిన పలువురు విద్యార్థులు దుఃఖాన్ని దిగమింగుకొని పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు. నారాయణపేట జిల్లాలో విద్యార్థిని అఖిల పరీక్ష రాసి వెళ్లి తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అనంతపురం గ్రామంలో గురువారం రాత్రి రైతు కృష్ణయ్య కన్నుమూయగా, ఆయన కుమారుడు క్రుంగిపోకుండా పరీక్షకు హాజరయ్యాడు. మరోవైపు నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండల కేంద్రంలో టెన్త్‌ పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థికి(15) గుండెపోటు రావడంతో పోలీసులు వెంటనే దవాఖానకు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా భయం తో ఇంట్లోనే ఓ విద్యార్థినికి అధికారులు వెళ్లి నచ్చజెప్పి పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. గంట ఆలస్యమైనా ఆ బాలికను పరీక్ష రాసేందుకు అనుమతించారు.

మంత్రి సబిత ఆకస్మిక తనిఖీలు

విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోరబండలోని నాట్కో ప్రభుత్వోన్నత పాఠశాల, యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆమె కరోనా నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. 

తదుపరి పరీక్షలపై 29న నిర్ణయం: చిత్రా రామచంద్రన్‌

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న పదోతరగతి పరీక్షలను వాయిదావేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30 తరువాత జరిగే పరీక్షలపై 29వ తేదీన నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


logo