తిరుమలాయపాలెం/ఖమ్మం రూరల్/ఖమ్మం ఎడ్యుకేషన్, హైదరాబాద్, డిసెంబర్ 18: సమ్మెలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగిని గుండెపోటుతో మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన కంచం హైమావతి (42) తిరుమలాయపాలెం ఎమ్మార్సీలో (సమగ్ర శిక్షా అభియాన్ విభాగం) కంప్యూటర్ ఆపరేటర్‌గా 19 ఏండ్లుగా పనిచేస్తున్నది. రెగ్యులరైజ్ చేయాలంటూ ఈ నెల 7 నుంచి సమ్మె చేస్తున్నారు.
ఈ ఆందోళనలో ఆమె కూడా పొల్గొన్నది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురైన హైమావతి ఈ నెల 13న అస్వస్థతకు గురైంది. అదే సమయంలో గుండెపోటు వచ్చింది. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మరణించింది. విషయం తెలుసుకున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు.. బుధవారం పెద్దతండాలోని ఆమె నివాసానికి వెళ్లి హైమావతి భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఆమె ఆత్మకు శాంతికలగాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ ఉద్యోగ నాయకురాలు ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ.. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై బెంగ కారణంగానే గుండెపోటు వచ్చి హైమావతి మృతిచెందిందని అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. హైమవతి మృతికి సర్కారే కారణమని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. 20వేల మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. హైమావతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.