హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): వచ్చే నూతన విద్యాసంవత్సరానికి సమగ్రశిక్ష అధికారులు రూ.1200 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సమగ్రశిక్ష ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి నిధులతో నిర్వహిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పిస్తారు. ప్రతిపాదనలపై ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. తెలంగాణ పీఏబీ సమావేశం ఈ నెల 24న ఆన్లైన్లో జరుగనున్నది. సమావేశంలో ఖరారుచేసిన ప్రణాళిక, బడ్జెట్ ప్రకారమే వచ్చే విద్యాసంవత్సరం నిధులను ఖర్చుచేస్తారు. కాగా, మధ్యాహ్న భోజన పథకం పీఏబీ సమావేశం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది రూ.228 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.340 కోట్లకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు.