హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుదర్శన చక్రత్తాళ్వార్కి వరాహ పుష్కరిణిలో అభిషేకాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు భక్తులను అనుమతించలేదు. కాగా, గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా 46,118 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారు. 10,594 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ ద్వారా రూ.4.09 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.