Srisailam | శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా తమ తీర్థయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్రసాదవితరణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. దేవస్థాన పరిపాలనా సంబంధిత అంశాలపై శ్రీనివాసరావు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు వారివారి విభాగాల సిబ్బందికి తగు దిశానిర్దేశం చేస్తూ సమన్వయంతో విధులను నిర్వర్తింపజేయాలన్నారు. ఏ ఉద్యోగి కూడా తన విధినిర్వహణలో అలసత్వంతో ఉండకూడదని హెచ్చరించారు. ఉద్యోగులందరు కూడా జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలన్నారు. అదేవిధంగా విధినిర్వహణలో పారదర్శకత ఎంతో ముఖ్యమన్నారు.
కాగా రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకనుగుణంగా ఆయా మౌలికసదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ విభాగంవారు శాస్త్రీయ అంశాల ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అదేవిధంగా రాబోవు అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రాభివృద్ధికి సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అన్ని నిర్మాణ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు నాణ్యమైన మెటీరియల్ను వాడాలన్నారు. అదేవిధంగా పనులలో తప్పనిసరిగా పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆయా పనులలో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. క్షేత్రపరిధిలో మరిన్ని శౌచాలయాలను నిర్మించాలన్నారు. ఇటీవల పూర్తి చేయబడిన ఇంజనీరింగ్ పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, సమీప భవిష్యత్తులో చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు.
భక్తులు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానంతరం క్షేత్రపరిధిలోని పంచమఠాలు, మల్లమ్మమందిరం, గో సంరక్షణశాల, ఉద్యానవనాలు మొదలైనవాటిని దర్శించే విధంగా భక్తులలో మరింత అవగాహన కల్పించాలన్నారు. అన్ని ఉద్యానవనాలలో కూడా మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఉద్యానవనాలలోని నడకదారులలో బండపరుపులకు అవసరాన్నిబట్టి మరమ్మతులు చేయాలన్నారు. ఉద్యానవనాల చుట్టూ ఉన్న కటాంజనాలకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ పనులు చేపడతుండాలన్నారు.
ఆయా ఉద్యానవనాలలో, తోటలలో మరిన్ని వృక్షజాతులను, ఔషధమొక్కలను, పండ్లమొక్కలను నాటాలన్నారు. ముఖ్యంగా శ్రీస్వామిఅమ్మవార్లకు కైంకర్యానికి వినియోగించే పూలమొక్కలను అధికసంఖ్యలో నాటాలన్నారు. అదేవిధంగా క్షేత్రపరిధిలో బిల్వం మొక్కలను ఎక్కువగా పెంచాలన్నారు. రాబోవు వర్షాకాలం ముగిసేలోగా క్షేత్రంలో కనీసం 3వేల మొక్కలు నాటేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మొక్కలునాటే కార్యక్రమం ప్రణాళికబద్దంగా ఉండాలన్నారు. దేవతావృక్షాలు, నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, పండ్లమొక్కలు, సుందరీకరణ మొక్కలు ఆయా ప్రదేశాలలో నాటేవిధంగా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ మొత్తం మొక్కలలో 30శాతం మేరకు దేవతావృక్షాలను నాటాలన్నారు. క్షేత్రపరిధిలోని పార్కింగు ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలలో నీడనిచ్చే చెట్లు నాటాలన్నారు. వలయరహదారికి ఇరుపువైపులా కూడా మరిన్ని నీడనిచ్చే మొక్కలను నాటాలన్నారు.
రుద్రాపార్కులోని ఏకశిలా రుద్రదేవుని విగ్రహం ఎదురుగా రాతినందిని నెలకొల్పేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానవనాలలో చిన్నపిల్లలు ఆడుకునేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఉద్యానవనాలలో తిరగలి, రోకలి, కవ్వం, సన్నెకల్లు మొదలైన గృహోపకరణాల నమూనాలను ఉద్యానవనాలలో ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన మన పూర్వజీవనాధారాలపై చిన్నపిల్లలలో అవగాహన కలుగుతుందన్నారు. గోశాలలో శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనివలన గోశాలలో పవిత్రత వాతావరణం నెలకొంటుందన్నారు. ముఖ్యంగా గోవులకు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటికి కాలానుగుణంగా టీకా మందులను వేయించాలని ఆదేశించారు. గోవుల సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నీంటిని తగినతంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీకార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, అన్నివిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.