Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లతోపాటు పరివార దేవతలకు శాస్ర్తోక్త పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. బుదవారం కృతికా నక్షత్రం సందర్బంగా కుమారస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా సాక్షి గణపతి, జ్వాలా వీరభద్రునికి పంచామృతాభిషేకాలు పుష్పార్చనలు చేసి భక్తులకు దర్శనాలు కల్పించారు. సాయంత్రం కళారాధన వేదికపై కడప జిల్లాకు చెందిన సాయినటరాజ్ డాన్స్ అకాడమి వారిచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితో పాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కింపు చేశారు. గత 32 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 4,43,53,163 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు.
శ్రీశైలం మహా క్షేత్రంలో మే 25 నుండి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. అందులో భాగంగా ఆలయ రాజగోపురాలకు, విమానగోపురాలకు పరంజా ఏర్పాటు పనులకు శ్రీకారం చుడుతూ పూజాధికాలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం గోపుర మండపానికి, పనిముట్లు సామాగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముందుగా శివాజీ గోపురం నుండి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ఈఈ వి. రామకృష్ణ, డీఈ నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహార్, సంపాదకులు అనీల్‌కుమార్, ఏఈలు భవన్, సీతారమేష్, ప్రణయ్‌లు పాల్గొన్నారు.