హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి మంత్రి శ్రీనివాసులును రాష్ట్ర వ్యవహారాల నుంచి గెంటేయించారు. ఆయనను పంజాబ్, చండీగఢ్‌కు బదిలీ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సీనియర్ నాయకుడు, తెలంగాణ వ్యక్తి అయిన మంత్రి శ్రీనివాసులు బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వ్యక్తిగత విమర్శలతో దిగజారుడుతనాన్ని ప్రదర్శించడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ప్రస్తావించారని తెలిసింది. ఈ విషయం అక్కడి నుంచి లీక్ అయ్యి బండి సంజయ్‌కి తెలిసింది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరికీ మంత్రి శ్రీనివాసులు అండ ఉన్నదని, కేంద్రం వద్ద పదేపదే వారి గురించి చెప్తూ హైలైట్ చేస్తున్నారని బండి గుర్రుగా ఉన్నట్టు చెప్పుకొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాగైనా శ్రీనివాసులును బయటికి పంపాలని బండి కంకణం కట్టుకున్నారట.
ఒక్క దెబ్బకు రెండుమూడు పిట్టలు
బండి సంజయ్‌కి పార్టీలో, అధిష్ఠానం దగ్గర పరపతి ఎంత పెరిగినా సంఘ్ నేతలు, రాష్ట్రంలోని కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ తన అదుపులోకి రాలేదనే వెలితి ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాధారణంగా వారంతా మంత్రి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. ఇటీవలి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర సమయంలో బండి వర్గానికి చెందిన ఓ మహిళా నాయకురాలు వారిపై పెత్తనం చేసేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించినట్టు సమాచారం. శ్రీనివాసులును తప్పించాలని గతంలోనే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారని, అనేక ఆరోపణలు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. మంత్రికి ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీస్సులు ఉండటంతో.. దుబ్బాక, హుజూరాబాద్ అంటూ ఎన్నికల వంక పెట్టి నిలువరించినట్టు సమాచారం. ఎన్నికలు పూర్తికాగానే బండి ఒత్తిడి చేస్తుండగా, దీనికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్ సహకరించారని సమాచారం. ఇక పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.