హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌ను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కేఫ్‌ను కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూడడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే టెండర్లు రద్దు చేసి, కల్లుగీత కార్పొరేషన్ ద్వారానే కేఫ్‌ను నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీరాకేఫ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే కల్లు దుకాణంగా మారుతుందని, కల్తి జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్తో కలిసి ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలోని నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు, గౌడ్ల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నీరాకేఫ్, నందనం నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రాజెక్టును అన్ని హంగులతో పూర్తిచేసినా ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోకపోవడంతో యంత్రాలు తుప్పుపడుతున్నాయని తెలిపారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి తక్షణమే నందనం ప్రాజెక్టును సందర్శించి, జూన్ 2వ తేదీలోగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే గీతకార్మికులే ప్రారంభించుకుంటారని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం నందనంలోని నీరా ప్రాజెక్టుకు ‘ధర్మ భిక్షం’ పేరు పెట్టాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ‘ధర్మ భిక్షం నామకరణం చేయాలని భావించామని, కానీ ఎన్నికల్ కోడ్ వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ గీతకార్మికుడికి సేఫ్టీకిట్లు పంపిణీ చేయాలని, వైన్షాప్లలో గౌడ్లకు ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్‌ను 25కు పెంచాలని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
శ్రీనివాస్‌గౌడ్ వెంట మాజీ జడ్పీటీసి మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, జిల్లా గౌడ సంఘం నాయకుడు అతికం లక్ష్మీనారాయణగౌడ్, జనగాం పాండు, బీఆర్ఎస్ భువనగిరి మండల అధ్యక్షుడు ఓంప్రకాశ్‌గౌడ్, జనరల్ సెక్రటరీ రమేశ్, మాజీ ఎంపీటీసీ కిరణ్, బీఆర్ఎస్ భువనగిరి పట్టణ అధ్యక్షుడు అజీమ్, మాజీ కౌన్సిలర్ ధనుంజయ్, జిల్లా నాయకుడు ప్రభాకర్, స్థానిక సర్పంచ్ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు.