హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతలతో నిరుపేదలను రోడ్డున పడేస్తరా? అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు భరోసా, భద్రత కల్పించాక వారి ఆమోదంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
అలా చేయని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న వేలాది మందిని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వ విధానంగా ఉండొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మానవీయ కోణం లోపించిందని, ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలా పరిధులను నిర్ధారించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను గుర్తిం చి వారికి తగిన ప్రత్యామ్నాయాలను చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే ప్రళయం తప్పదని స్పష్టంచేశారు. ఎప్పుడు ఏం చేయాలి? ఎలా స్పందించాలో కేసీఆర్‌కు సంపూర్ణంగా తెలుసునని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ఆకాంక్షలను నెవరేర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని, విభజన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు.