మహబూబ్నగర్ : తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ(Ilamma) బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud) కొనియాడారు. మంగళవారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు.
తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఐలమ్మ గురించి తెలియజేసేందుకు జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్ లు రవికిషన్ రెడ్డి ,గణేష్, రాము, పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ లీడర్స్ నవకాంత్, పాల సతీష్, చిట్యాల సుధాకర్, కిషన్ పవర్ తదితరులు పాల్గొన్నారు.