హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : నయవంచన, మోసానికి కేరాఫ్ కాంగ్రెస్ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసులు, కక్షలు, కమీషన్లే రేవంత్ సర్కారు విధానమని నిప్పులు చెరిగారు. పాలన చేతగాక, పథకాలను అమలుచేయలేక, అభివృద్ధి కొనసాగించలేక బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపులకు దిగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు. కేటీఆర్ ఖాతాలో నయాపైసా ప్రజాధనం చేరలేదు. అయినా ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖతో విచారణ చేపట్టడం హాస్యాస్పదం’ అని విమర్శించారు.
ఫార్ములా రేసుతో కేటీఆర్ రాష్ట్ర ప్రతిష్టను పెంచితే అందాల పోటీలతో రేవంత్ పరువు తీశారని మండిపడ్డారు. ఈ పోటీలు నిర్వహించి మహిళల ఆత్మగౌరవం మంటగలిపిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. తనను వేశ్యలా చూశారని మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఏకంగా ఆ పార్టీ అధినేత సోనియాకే ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు.
అయినా, ప్రభుత్వం పట్టింపులేని తనంతో వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై దూషణలు మాని ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటా ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తున్నదని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బీసీ సంఘాలు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.