హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను విస్మరించిందని, వారిని వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
రాష్ట్రంలో మూడు నెలలుగా ఉద్యోగుల వేతనాల నుంచి 1.5శాతం ఈహెచ్ఎస్ కోత విధిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దవాఖానల్లో ఈహెచ్ఎస్ సేవలు అందక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ స్కీమ్ వర్తించక ఖాజామొహియుద్దీన్ అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రైవేట్ దవాఖానలో రూ. 8లక్షలు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు నెలకు రూ. 2వేల కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నదని, 15వేల కోట్లు బకాయిలు ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలోని 4.90 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే హామీని ప్రభుత్వం విస్మరించిందని శ్రీనివాసగౌడ్ విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 1,000 కోట్ల నిధులు పకదారి పట్టాయని, ఈ విషయంలో ఓ మంత్రిపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేపట్టే నిరసనలకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేసిన తప్పుడు ప్రచారాలను సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఎలాంటి లోపాలు లేవని ఆ నివేదిక స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వం దాదాపు మూడేండ్లలో ఒక డీ ఏ కూడా ఇవ్వలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. ఇప్పటివరకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తె లిపారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో నూ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో మినీ ఎమర్జెన్సీ నడుస్తున్నదని మండిపడ్డారు.