హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో జంతువులకు ప్రామాణికమైన లెక్కలు ఉన్నాయని, ఇప్పటివరకు వివిధ కులాల వృత్తిదారులకు ప్రామాణికమైన లెక్కే లేదని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల జనాభా ఉన్న వృత్తిదారులకు ఇప్పటివరకు సరైన లెక లేదని, ఏ కులవృత్తి మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారనే విషయాలు తెలియడమే లేదని చెప్పారు.
బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో నారాయణగురూ ట్రస్ట్, ఓబీసీ ఆర్గనైజేషన్స్ (బిలవా, నాడార్, బండారి, నాయక్, ఈడిగ, జైస్వాల్ తదితర సంఘాలు) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓబీసీ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు. కులాలు, వృత్తులు, వారి ఆర్థిక, కుటుంబ, విద్య, ఉద్యోగాల వంటి అంశాల్లో నిర్దిష్టమైన సంఖ్య లేదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జనగణన చేస్తున్నారని, కులగణన చేపట్టడం లేదని చెప్పారు. అన్నిరకాల వృత్తిదారుల కుటుంబాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని, ఆ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియతో కొందరు మాత్రమే బాగుపడతారని చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ కోరారు.