ఖైరతాబాద్, ఆగస్టు 3: బీసీల రాజ్యాధికారం కోసం తెలంగాణ తరహాలో మరో ఉద్యమానికి సిద్ధమవ్వాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిపార్కు ధర్నాచౌక్ వద్ద ఈ నెల 10న నిర్వహించే ‘బీసీల సత్యగ్రహదీక్ష’ పోస్టర్లను బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్లు, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు పిడికిలి రాజు, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, టీ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మోసం చేయాలని కాంగ్రెస్‌పార్టీ ప్రయత్నిస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ నెల 10న బీసీల సత్యగ్రహ దీక్షకు కులాలు, సంఘాలు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ తరహాలో మరో సారి తెగించి పోరాడి, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే బహిరంగంగా కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీ విప్లవం రాబోతున్నదని, ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు.
రాజారాం యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలో రాహుల్ గాంధీ ఓ మాట, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మరో విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ ద్వంద వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగడుతామని చెప్పారు. సత్యగ్రహదీక్షకు బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు ఎల్. గోవర్ధన్, యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ కృష్ణ యాదవ, నవ సంఘర్షణ సమితి నాయకులు శ్రవణ్ గౌడ్, లింగస్వామి గౌడ్, విద్యార్ధి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజు, ఓయూ విద్యార్ధి సంఘాల జేఏసీ నాయకులు అశోక్ యాదవ్, జక్కుల మధు యాదవ్, హిందూ బీసీ ఆజాదీ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు దేశం మహేశ్ గౌడ్, అంబేద్కర్ ఆజాదీ సంఘ్ నాయకుడు కొంగర నరహరి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలంపల్లి రామకోటి ముదిరాజ్, తెలంగాణ బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ పాల్గొన్నారు.