హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పునరుజ్జీవం పోసుకున్న కులవృత్తులకు మళ్లీ విధ్వంసకర పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తంచేశారు. కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో సేడం నుంచి బెంగళూరు వరకు ప్రణవానందస్వామి చేపట్టిన పాదయాత్రలో భాగంగా జ్యూవర్గి పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): బీసీ ఉద్యోగులు ఐక్యత చాటాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూ పొందించిన 2026 క్యాలెండర్‌ను పొన్నం శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రమాదేవి, శ్రీనివాస్, రామరాజు, శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని ఈ నెల 11న అధికారికంగా నిర్వహించనున్నట్టు బీసీ వెల్ఫేర్ కమిషన్ బాలమాయాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10గంటలకు రవీంద్రభారతిలో కార్యక్రమం ఉంటుందని తెలిపారు.