హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన గోపగాని శ్రీనిఖ ఎంబైపీసీ, ఖమ్మం జిల్లాకు చెందిన టీ హరీశ్ ఎంపీసీ విభాగంలో స్టేట్ టాపర్లుగా నిలిచారు. మే 24న ఈ పరీక్ష నిర్వహించగా, ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 92,808 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 82,809 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 69,728 (84.20శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. బాలురు 46,319 మందికి 37,269 (80.47శాతం), బాలికలు 36,496 మందికిగాను 32,459 (88.94శాతం) క్వాలిఫై అయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికలే సత్తాచాటారు. ఎంపీసీలో 88.94, ఎంబైపీసీలో 88.30శాతం క్వాలిఫై కాగా, బాలురు ఎంపీసీలో 80.47, ఎంబైపీసీలో 77.90శాతం క్వాలిఫై అయ్యారు. వీరికి ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గోపగాని శ్రీనిఖ, జీ భవిత ఎంపీసీ, ఎంబైపీసీ రెండు విభాగాల్లోనూ సత్తాచాటి స్టేట్ టాపర్లుగా నిలిచారు. సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య, సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ శ్రీనాథ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో118 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, ఈ ఏడాది షాద్‌నగర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించనున్నారు.