హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఇస్కాన్, హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకుడు, సాంస్కృతిక రాయబారి శ్రీల ప్రభుపాదులకు అఖిల భారతీయ అఖాఢ పరిషత్ ‘విశ్వగురు’ బిరుదుతో సత్కరించింది. మహా కుంభమేళా సందర్భంగా అఖాఢ పరిషత్ అధ్యక్షుడు హెచ్ మహంత్ పూరిజీ మహారాజ్, వివిధ అఖాఢాల నుంచి విచ్చేసిన మహా మండలేశ్వరులు, సీనియర్ సాధువులు, వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీల ప్రభుపాదులకు ఈ బిరుదును ప్రదానం చేశారు.
చరిత్రలో ఈ బిరుదును పొందిన తొలి, ఏకైక వ్యక్తి శ్రీల ప్రభుపాదులని వక్తలు ప్రశంసించారు. శ్రీకృష్ణుని సందేశాన్ని ప్రచారం చేయడానికి ఆయన చేసిన మార్గదర్శక ప్రయత్నాలు ఫలించి లక్షలాది మంది ఆ బాటలో నడిచారని గ్లోబల్ హరే కృష్ణ ఉద్యమ చైర్మన్, గురువు మధు పండిట్ దాసు ప్రశంసించారు.
ఇస్కాన్ బెంగళూరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంచలపతి దాసు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆచార్య మహామండలేశ్వర్ అవధూత్ అరుణ్ గిరీ జీ మహారాజ్, నిరంజనీ పీఠాధీశ్వరుడు స్వామి కైలాసనంద గిరి మహారాజ్, అఖాఢ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి జీ మహారాజ్ పాల్గొన్నారు.