హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ నియామక ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) చాలా దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గురువారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నల్సార్ యూనివర్సిటీలో ‘ఉద్యోగ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు’ అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో యూపీఎస్సీ చైర్మన్ అజయ్‌కుమార్‌తో కలిసి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
సదస్సు నిర్వహణలో టీజీపీఎస్సీ చొరవ చూపిందని అభినందించారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియలో వివాదాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మాడల్స్, డిజిటలైజేషన్‌ను ఉపయోగించుకోవాల్సిన అవసరముందని తెలిపారు. సదస్సులో టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.