హైదరాబాద్: శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్ వియలందేరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో (KTR) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేళ్ల కాలంలోనే సాధించిన అద్భుత ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా సతాశివన్ కేటీఆర్‌కు తెలిపారు.
హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే.. సింగపూర్‌ను తలపించేలా ఉందని ప్రశంసించారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటీఆర్.. తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన తీరును సదాశివన్ అభినందించారు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణలో ఓవైపు ఐటీ, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్, మరోవైపు ఫార్మా రంగాలకు ఏకకాలంలో పెద్దపీట వేసి పారిశ్రామిక రంగాన్ని మెరుపువేగంతో పరుగులు పెట్టించడం అరుదైన విషయమని తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాలే ఏ దేశానికైనా ఆర్థిక ఇంజిన్లని, వీటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుందని అన్నారు. ఓసారి తాను చెన్నైలో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడి పోలీసు అధికారితో మాట్లాడానని, తమిళనాడు కంటే.. తెలంగాణ పోలీసులకే ఎక్కువ వేతనాలు అందుతున్నాయనే విషయాన్ని అతను చెప్పారని సదాశివన్ గుర్తుచేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణలో గత పదేండ్లపాలనను ఓ యజ్ఞంలా సాగించామని, అందుకే అనతికాలంలోనే అసాధారణ ఫలితాలు సాధించగలిగామని వెల్లడించారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లో సంపదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లెపల్లెనా పేదలకు పంచామన్నారు. పారిశ్రామిక రంగానికేకాదు.. పర్యావరణానికి కూడా సమప్రాధాన్యం ఇచ్చామని, తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచడం దేశంలోనే అరుదైన రికార్డు అని గుర్తుచేశారు. తెలంగాణకు హరితహారం పేరిట చేపట్టిన కార్యక్రమం మానవ చరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రయత్నమని వెల్లడించారు. చిన్న వయసులోనే శ్రీలంక ఎంపీగా, కేంద్రమంత్రిగా ఎదగడంపట్ల అభినందనలు తెలిపిన కేటీఆర్.. సదాశివన్‌ను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు జాజాల సురేందర్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Had a productive meeting with Sri Lankan Minister Sri Sathasivam Viyalendiran today who called on me in Hyderabad
Honored by his words on Telangana’s rapid progress and the development of Hyderabad. Proud of how far we’ve come in just ten years. Grateful to Minister Sathasivam… pic.twitter.com/nHjDt0PhHG
— KTR (@KTRBRS) August 19, 2024