అలంపూర్, జూలై 2 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదిగా పేరొంది పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ క్షేత్రంలో మూడ్రోజులు గా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. గురువారం ఉదయం 10 గంటలకు సింహలగ్న శుభ ముహూర్తంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన మహోత్సవాలు జరిగాయి. శృంగేరి మఠం పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జోగుళాంబ గర్భాలయంలో సనాతన ధర్మ సంప్రదాయ పద్ధతిలో పండితుల వేద ఘోష మధ్య శ్రీచక్ర ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించారు.
ఏపీటోమ్ సంస్థ ఎండీ జైపాల్కాంత, శ్రీవిద్య దంపతుల సమక్షంలో యంత్ర ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఇక్కడి క్షేత్రంలో 12వ శతాబ్దం కిందట జగద్గురు ఆది శంకరాచార్యులు సనాతన ధర్మ పునరుద్ధరణ యాత్రలో భాగంగా అలంపూర్ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి జోగుళాంబ మాతను ఆరాధించారు. ఉగ్రరూపంలో దేవిని శాంతింప జేసేందుకు శంకరాచార్యులు ఆలయంలో శ్రీచక్ర మహాయంత్రాన్ని ప్రతిష్ఠించారు.