హసన్పర్తి, సెప్టెంబర్ 6 : ఎన్ఐఆర్ఎఫ్ ఇంజినీరింగ్ క్యాటగిరీలో ఎస్సార్ యూనివర్సిటీకి ఆలిండియా స్థాయిలో 91వ ర్యాంకు లభించిందని ఆ యూనివర్సిటీ చాన్స్లర్ ఏ వరదారెడ్డి తెలిపారు. శనివారం ఆయన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని ఎస్సార్ యూనివర్సిటీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సార్ యూనివర్సిటీ మరోసారి తన ప్రతిభను చాటుకొని వరుసగా నాలుగో ఏడాది టాప్ 100లో చోటుదక్కించుకున్నట్టు తెలిపారు. నాణ్యమైన విద్య, పరిశోధన, ఆవిష్కరణలపై తమ యూనివర్సిటీ పట్టును మరోసారి రుజువు చేసుకున్నదని పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ క్యాటగిరీలో 100లోపు స్థానం పొందిన ఏకైక సంస్థ తమదేనని వివరించారు. వరుసగా తమ యూనివర్సిటీకి ర్యాంకులు దక్కడంలో అధ్యాపకుల బృందం, విద్యార్థుల కృషి ఎంతో ఉన్నదని కొనియాడారు. ఈ ర్యాంకులు రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చాన్స్లర్ దీపక్గార్గ్, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి పాల్గొన్నారు.