హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతున్నదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సూత్రధారి అయితే.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాత్రధారి అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఏజెంట్ అని విమర్శించారు. తెలంగాణ సినీ మ్యుజీషయన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తెలంగాణ కళాకారుల ఆత్మగౌరవ గర్జనలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ మళ్లీ దగాపడేలా చేస్తున్నారని ఆరోపించారు.
‘రేవంత్‌రెడ్డీ నీ అంతు చూస్తాం.. నువ్వు చంద్రబాబు ఏజెంటువు.. నువ్వెంత నీ బతుకెంత.. ప్రజాకోర్టులో నీకు శిక్ష తప్పదు.. బేషరతుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇక్కడి దర్శకులకే అప్పగించాలి’ అని పాశం డిమాండ్ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి కాదని చోరవాణి అని విమర్శించారు. తెలంగాణ సినీ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, దర్శకుడు ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కీరవాణితో పాట విడుదల చేస్తే పనైపోతుందని అనుకుంటున్నారని, విడుదలైనప్పటి నుంచే మా పని మొదలవుతుందని హెచ్చరించారు. తెలంగాణ గీతాన్ని ఊరూరా పాడించి అనేక పాటలు విడుదల చేయిస్తామని చెప్పారు. తెలంగాణ కళాకారులను కించపరిచే విధంగా గీతాన్ని కీరవాణికి అప్పగించడం సరైనది కాదన్నారు. సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ మాట్లాడుతూ 9 నెలల్లో కాంగ్రెస్ భూస్థాపితమయ్యేలా కనిపిస్తున్నదని జోష్యం చెప్పారు. అందెశ్రీ.. అందనిశ్రీగా మారిపోయాడని విమర్శించారు. రేవంత్ ఆంధ్ర మేస్త్రీ కింద కింద పనిచేస్తున్నారని సభ్యుడు పృథ్వీ విమర్శించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.