ఖమ్మం, జూన్ 16: ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో మూడు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నగరంలోని పలు డివిజన్లలో బైక్‌పై విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెరువుబజార్లోని పాత కబేళా వద్ద ప్రధాన కాలువ మురుగు తొలగింపు పనులను ప్రారంభించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బోనకల్లు రోడ్డులోని లక్ష్మి గార్డెన్స్ వద్ద 2022-23 గ్రీన్ బడ్జెట్‌తో ఏర్పాటు చేసిన నర్సరీని మంత్రి ప్రారంభించారు.
శ్రీనివాసనగర్‌లో రూ.30 కోట్లతో నిర్మించనున్న గోళ్లపాడు చానల్ మురుగు నీటి శుద్ధి కేంద్రం పనులకు మంత్రి అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలోని దుకాణదారులు, వీధి వ్యాపారులు ఖాళీ బాటిళ్లు, కొబ్బరి బొండాలు, చెత్తా చెదారాన్ని మురికి కాల్వల్లో వేయొద్దని సూచించారు. పారిశుద్ధ కార్మికులు నిత్యం సైడ్ కాలువల్లో పూడిక తీస్తూ మురుగు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.