పండుగంటే పిండి వంటలు, కొత్త బట్టలే కాదు.. ఆ పండుగకు కొన్ని ప్రత్యేక పదాలు కూడా ఉంటాయి. అవి ఆ పండుగ సమయంలోనే ఎక్కువగా జనం నోట నానుతుంటాయి. ఆ పదాలే కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాయి. ప్రతి పండుగకు అలాంటి ఎన్నో పదాలు వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయంలో సంక్రాంతి అన్ని పండుగల కంటే ఓ రెండడుగులు ముందే ఉంటుంది.
చిన్న పిల్లవాడు మొదలు వృద్ధుల వరకు అందరి చేతుల్లో పతంగి దర్శనమిస్తుంటుంది. ‘పద పదవె వయ్యారి గాలిపటమా’ అంటూ పతంగిని ఎగిరేసే సమయంలో అలాంటి ఎన్నో పదాలను ప్రత్యేకంగా వినియోగిస్తుంటారు. ప్రతి పతంగి, ప్రతి మాంజాను ప్రత్యేక పేరుతో పిలుస్తున్నారు. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా ఆస్వాదిస్తున్నారు.
ఎవడ్రా ఆ ఎర్ర పతంగికి కర్ణాలు కట్టింది.. బొమ్మ లెక్కనే నిలవడ్డది.. దారాన్ని చెట్టుకు కట్టేసి ట్టినాగానీ అట్లనే నిలవడ్తట్టుంది..
అబ్బా ఆ పచ్చ పతంగి సూడురా.. గిరికీలు తిరుగుకుట్ట ఎట్ల పోతుంది..
ఆ గుడ్ల పతంగిని ఎవరు పిలాంచుతుండో గానీ.. మస్తు తిప్పుతుండు..
పర్ణి (కవర్) పతంగోడు ఏమన్నా పేంచ్ ఏసిండా..!
గుడ్ల పతంగి (పతంగిపై గుడ్డు ఆకారంలో పేపర్), నామాల పతంగి (బద్ద మధ్యలో యు ఆకారం ఉండటం), చందమామ పతంగి, ఆది రోటీ (రెండు రంగుల్లో ఉండే పతంగి), డోరేదార్ పతంగి (పతంగి చివర్లో దారాలు ఉంటాయి), పర్ని (కవర్) పతంగులు.. ఇలా ఇంకా ఎన్నో పతంగుల పేర్లు వినిపిస్తుంటాయి. మరోవైపు, గాజరీ (ఆరెంజ్ కలర్), గంధక్ (గంధం కలర్), మిలిటరీ మాంజా (డార్క్ కలర్), అంగూరీ మాంజా (గ్రేప్స్ కలర్), అండేకా మాంజా (తెలుపు రంగు), పీలా మాంజా (పచ్చని రంగు), లాల్ మాంజా (ఎర్రని రంగు), టంగూస్, కర్కరా మాంజాల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.
వీటితోపాటు మాంజా సుతాంచుడు అనే పదం వినిపిస్తుంది. అంటే అన్నం మెత్తగా తయారుచేసి.. రంగులు, ఇతర సన్నని సీసం ముక్కలతో దారానికి అద్దడాన్ని సుతాంచుడు అని అంటారు.