హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నంబర్ 243/2024) దర్యాప్తులో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ ఇంకా పూర్తికాలేదని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణ జరిగిందని పేర్కొన్నారు. అయితే, తన కుమారుడి విమాన ప్రయాణం ఉన్నందున విచారణ త్వరగా ముగించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారని, ఆయన అభ్యర్థన మేరకు త్వరగా ముగించామని తెలిపారు. కాగా, ఈ కేసు దర్యాప్తుతో సంబం ధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని, జోక్యం చేసుకోవద్దని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేసినట్టు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన చార్జిషీటు దాఖలు చేశామని వివరించారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీశ్‌రావును విచారిస్తున్నారంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.