హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు ప్రపంచంలోనే విశిష్టమైన పథకమని దళిత్ స్టడీస్ సెంటర్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ఇది అత్యంత ఆవశ్యకమైన, అత్యవసరమైన గొప్ప పథకమని అభివర్ణించారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
దళితబంధును చాలా మంది ఎన్నికల పథకంగా ప్రచారం చేశారని, ఆ విమర్శలను కొట్టిపారేస్తూ సీఎం కేసీఆర్ తాజా బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించారని గుర్తుచేశారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉటంకించినట్టు దళితబంధు కేవలం ఒక పథకం కాదని, దళితులకు ఉపాధి, ఆత్మగౌరవం, అభివృద్ధి, వికాసాన్ని చేకూర్చే ఒక సమర్థవంతమైన విధానమని పేర్కొన్నారు. దళితజాతి ఆర్థిక ప్రగతి సాధించిన రోజున సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయని, అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 46 స్ఫూర్తిని సజీవంగా నిలబెడుతుందని అన్నారు.