హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి నాదర్గుల్ పరిధిలో రూ.6 వేల కోట్ల విలువైన భూముల బిగ్ దందాపై ‘ఎవని జాగీరు!’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన ప్రత్యేక కథనం రాష్ట్ర సర్కార్‌లో ప్రకంపనలు పుట్టించింది. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతోపాటు అధికార యంత్రాంగంలో విస్తృతస్థాయి చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు నాదర్గుల్ భూముల్లో ఏం జరుగుతుంది? అన్న అంశంపై సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 613 (119)లో రూ.6 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల దందా బట్టబయలైంది. ఏడు దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న 373.22 ఎకరాల భూములను చడీచప్పుడు కాకుండా కైంకర్యం చేసేందుకు తెరవెనుక ప్రభుత్వ పెద్దలు రచించిన కుట్రల గుట్టు రట్టయింది.
ఆ భూములను నిషేధిత జాబితాలో పొందుపరిచి.. కండ్ల ముందు నిర్మాణ సంస్థలు దర్జాగా దౌర్జన్యకాండను సాగిస్తున్నా వ్యూహాత్మకంగా మౌనం వహించిన రెవెన్యూ ఉన్నతాధికారుల బాగోతం చట్టాలతో సహా అందరికీ తేటతెల్లమైంది. ప్రభుత్వ రికార్డుల పరంగా నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఆ భూములపై నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు ఎలా వచ్చారు? ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడుతున్నారు? అసలు వారి వద్ద ఉన్న న్యాయస్థానాల ఉత్తర్వులు ఏమిటి? ఆ కేసుల తాజా పరిస్థితులతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను సర్కార్ సూచించినట్టు సమాచారం. దీంతోపాటు శనివారం ఉదయం నుంచే ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు పెద్ద ఎత్తున నమస్తే కథనంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.
జర్నలిస్టులు, అధికారులు, స్థానిక పోలీసులు, నాదర్గుల్ గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రెవెన్యూ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టినట్టు తెలిసింది. ఆ భూములకు సంబంధించిన పాత రికార్డులు తీసి, ఇతర కోర్టు కేసులు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వివరాలన్నింటితో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే పనిలో పడ్డట్టు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కూడా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనంపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలిసింది. నాదర్గుల్ ఉండే బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయం జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నందున ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయం నుంచి హాజరైన అధికారులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సర్వేనంబరు 613 భూములు వివాదాస్పదంగా ఉన్నందున అందులో ఎలాంటి అనుమతులు ఇవ్వొదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయానికి పలువురు అధికారులు వచ్చి ఆరా తీశారు. 613 సర్వేనంబరులో ప్రహరీ కానీ, ఇతర నిర్మాణాలకు ఏమైనా అనుమతులు ఇచ్చారా? అన్న వివరాలు సేకరించారు. వాస్తవానికి ఆ భూముల్లో తిష్టవేసిన ఓ నిర్మాణ సంస్థ గత నెల 27న బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకొన్నది. దాని వెంట వివిధ కోర్టు ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కూడిన భారీ పుస్తకాలు (వాల్యూమ్స్) అందజేశారు. ఒక దశలో అనుమతులు ఇచ్చేందుకు సర్కిల్ ఉన్నతాధికారులు ప్రాథమికంగా కసరత్తు చేసినట్టు వినికిడి.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నాదర్గుల్ బాధిత రైతులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకులు కాడిగల్ల భాస్కర్ డిమాండ్ చేశారు. నాదర్గుల్ రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం న్యాయస్థానాల్లో తగిన వాదనలు వినిపించి ప్రభుత్వ భూములను కాపాడి, రైతులకు పంపిణీ చేయాలని కోరారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు భూకబ్జాదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వ్యవసాయం చేసుకుంటున్న రైతులను బెదిరించి, అడ్డుకొంటున్న భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జాగీర్ల రద్దు, భూ సంస్కరణ సీలింగ్ చట్టాలను తుంగలో తొక్కి దళిత, బలహీనవర్గాల రైతుల పొట్టలుగొట్టేందుకు ప్రభుత్వ వైఖరే కారణమని పేర్కొన్నారు. భూకబ్జాదారులు ఈ భూములను తనఖా పెట్టి పెద్ద ఎత్తున తీసుకొన్న రుణాల విషయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెంటనే దృష్టి సారించాలని కోరారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు కర్రె యాదయ్య, శేష్‌పాల్, సీపీఎం నాయకులు కిషన్, తదితరులు పాల్గొన్నారు.
నాదర్గుల్లోని సర్వేనంబరు 613లోని భూముల కథ బయటి ప్రపంచానికి కొత్తదే అయినా.. జిల్లా కలెక్టర్ మొదలుకొని రెవెన్యూ అధికారులందరికీ ఆ భూముల కథ తెలియనిది కాదు. పైగా ప్రస్తుతం కలెక్టర్ నారాయణరెడ్డి రెవెన్యూ, స్టాంపుల శాఖ కమిషనర్‌కు పంపిన నిషేధిత జాబితాలో ఈ సర్వేనంబరు కూడా ఉన్నది. వీటన్నింటికీ మించి ఏ పహాణీల్లోనూ వారసుల పేర్లు నమోదు కాలేదు. ఏజీపీఏ, సేల్ డీడ్స్ చేయించుకొన్న వ్యక్తుల, కంపెనీ పేర్లు కూడా మ్యుటేషన్ కింద రికార్డుల్లోకి ఎక్కలేదు. కానీ రెండేండ్లుగా ఆ భూముల్లో పాగా వేసి… ఇప్పుడు చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు ఓ నిర్మాణ సంస్థ యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నా ఉన్నతాధికారులు వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఎవరు అడిగినా అది ప్రభుత్వ భూమే, పనులను నిలిపివేశాం కదా! అని సమాధానమిస్తూ చాపకింద నీరులా పనులు కొనసాగేందుకు పరోక్ష సహకారాన్ని అందించారనేది బహిరంగ రహస్యం. అంటే ఆ పనులు పూర్తికాగానే సదరు నిర్మాణ సంస్థ వాటి ఆధారంగా మరిన్ని న్యాయస్థానాల ఉత్తర్వులు తీసుకొచ్చి, రాత్రికి రాత్రే రికార్డులను తారుమారు చేయాలనే పన్నాగం దాగి ఉన్నది. ఆపై హెచ్ఎండీఏ నుంచి అనుమతులతో కార్పొరేట్ తరహా భారీ రియల్ దందాకు స్కెచ్ వేశారని తెలుస్తున్నది.
‘ఎవని జాగీరు!’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం నాదర్గుల్ గ్రామంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎకరా రూ.15 కోట్లకు పైగా విలువ చేసే 373.22 ఎకరాల భూములు తమ కండ్ల ముందు ఓ నిర్మాణ సంస్థ ఆధీనంలోకి వెళ్లడంతో బాధిత రైతులకు ‘నమస్తే కథనం’ కొండంత ఊరటనిచ్చింది. తాము ఏడు దశాబ్దాలుగా నమ్ముకొని సాగు చేసుకొంటున్న ఆ భూముల్లోకి రెండేండ్లుగా తమను వెళ్లనీయడం లేదని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా ప్రజాప్రతినిధులతోపాటు తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్, హైడ్రా, పోలీసులకు బాధిత రైతులు ఫిర్యాదులు చేస్తూ న్యాయం కోసం చకోర పక్షుల్లా తిరుగుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇదే సమయంలో ‘నమస్తే తెలంగాణ’ కథనం రావడంతో వారిలో చైతన్యం చిగురించింది. పత్రిక కథనాలు చూసిన గ్రామంలోని బాధిత రైతులంతా స్థానిక బస్టాండ్ వద్దకు చేరుకొని సమావేశమయ్యారు. నిర్మాణ సంస్థ ఇచ్చే ఐదారు లక్షలకు ఆశపడితే కోట్ల విలువైన భూమితోపాటు కుటుంబాలకు ఆధారంగా ఉన్న వ్యవసాయానికి దూరం అవుతామని చర్చించుకొన్నారు. న్యాయపరంగా పోరాడుదామని రైతులందరూ ప్రతినబూనారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నమే న్యాయవాదులను కూడా కలిసినట్టు తెలిసింది. అందుబాటులో లేని రైతులనూ కలుపుకొని పోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రైతుసంఘం, సీపీఎం జిల్లా నాయకులు కూడా వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు.