హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఎరువుల్లేకుండా కొరత ఏర్పడితే అది సమస్యే. కానీ, అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నా కొరత ఏర్పడితే అది సరఫరాలో లోపం అవుతుంది. ఎరువుల పంపిణీలో తరుచూ తలెత్తుతున్న ఇలాంటి సమస్యకు ప్రత్యేక పోర్టల్ ద్వారా పరిష్కారం చూపాలని వ్యవసాయశాఖ యోచిస్తున్నది. ఇందులో ఎరువుల పంపిణీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరుస్తారు. జిల్లా కేంద్రాల నుంచి ఫ్యాక్స్‌కు, డీలర్లకు, ఎఫ్‌పీవోలకు ఎవరికి ఎంతమొత్తం సరఫరా చేశారనే లెక్కలు ఉంటాయి. ఏ రైతు ఎంత ఎరువు కొనుగోలు చేశారనే సమాచారాన్ని కూడా పొందుపరచనున్నారు. వాస్తవానికి కేంద్రం రాష్ర్టానికి కేటాయించిన ఎరువులను.. మార్క్‌ఫెడ్, ప్రైవేటు కంపెనీల ద్వారా జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. అక్కడిదాకా లెక్కలు పక్కాగానే ఉంటాయి. జిల్లా కేంద్రాల నుంచి ఎవరికి, ఎక్కడికి ఎంత సరఫరా చేస్తున్నారనే విషయం మాత్రం సరిగా ఉండటం లేదు. దీంతో పలుచోట్ల కృత్రిమ కొరత ఏర్పడుతున్నది. ఒక జిల్లాలో వర్షాలు పడటంతో అక్కడ ఒక్కసారిగా డిమాండ్ పెరిగి కొరత ఏర్పడుతున్నది. మరో జిల్లాలో ఎరువులు అలాగే పడి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోర్టల్ ద్వారా పైస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అందరి అధికారులను సమన్వయం చేయనున్నారు. ఎక్కడ వర్షం పడింది? ఎక్కడ డిమాండ్ ఉన్నది? వంటి వివరాలను ఎప్పటికప్పుడు అందరికీ చేరవేయనున్నారు. ఈ సమాచారం ఆధారంగా అవసరమున్న జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ఎరువులను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు.