హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నవంబర్ 15న ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనుంది. చిన్నపాటి కేసుల ప్రభావం కోర్టులో ఎకువగా ఉందని, చిన్నచిన్న క్రిమినల్ కేసుల భారం తగ్గించడానికి నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌కు సహకరించాలని పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ సూచనలతో ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించడానికి డీజీపీ బీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీలు మహేశ్ భగవత్, చారుసిన్హాలతోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, హైదరాబాద్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. చిన్నపాటి క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసుల పరిషారానికి శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీజీపీ స్పందిస్తూ, జరిమానా విధింపునకు చెందిన కేసుల పరిషారానికి సహకారం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, పరిపాలన అధికారి రాజు, ఇతరులు పాల్గొన్నారు.