హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సామాజిక భద్రత కొరవడిందని హైకోర్టు అభిప్రాయపడింది. వేళాపాళా లేకుండా పనిచేయాల్సిన దుస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారని, కుటుంబసభ్యులతో తగినంత సమయం గడపలేక మానసిక ఒత్తిడితో 30 ఏండ్లకే అనారోగ్యం బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అసంఘటిత రంగంలో కొనసాగుతున్న ఆ అభాగ్యులకు సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు వారి హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించింది.
ఉద్యోగుల హకులను హరించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని పాటించకుండా రాజీనామా చేసినందుకు రూ.5.9 లక్షల పరిహారం చెల్లించాలని ఓ ఐటీ కంపెనీ తమ ఉద్యోగిని డిమాండ్ చేయడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక కీలక తీర్పు వెలువరించారు.
కంపెనీ డిమాండ్‌ను సవాలు చేస్తూ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ తీర్పు వెలువడింది. కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వాణిజ్యం, వ్యాపారం చేపట్టకుండా ఆపే ఒప్పందాలు చెల్లుబాటు కావని ఆ తీర్పులో పేర్కొన్నారు. కంపెనీలు కార్మిక చట్టాలను అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షించడంలో కార్మిక శాఖ విఫలమైందని ఆక్షేపించారు. పరిహారం చెల్లించాలని పిటిషనర్‌ను కంపెనీ ఏ ప్రాతిపదికపై డిమాండ్ చేసిందో సమీక్షించి చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలని కంపెనీకి స్పష్టం చేశారు.