హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందించింది. దాదాపు రూ.25 కోట్లతో రాష్ట్రంలోని ఆరు ఆలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిధులతో మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రామాలయం, వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర ఆలయం, సిద్దిపేట కుడాల్ వ్యాలీలోని రామలింగేశ్వర ఆలయం, హైదరాబాద్‌లోని బల్కంపేట యెల్లమ్మ ఆలయం, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు.
ఆయా ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటుచేయనున్నారు. ఆయా ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. భద్రాచలం, రామప్ప ఆలయాలను ‘ప్రసాద్’లో చేర్చిన కేంద్రం మిగిలిన ఆలయాలకు నిధులివ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే దశలవారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు పర్యాటకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు.