Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అమ్మ ఆశీర్వాదం కోసం ఆ పార్టీ నేతలు జూబ్లీహిల్స్‌కు పరుగులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యనేత మాట కంటే ఆ ఆమ్మ ఆశీస్సులకే పవర్ ఎక్కువట. అమ్మ దయ ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉద్యోగుల బదిలీలు ఏదంటే అది చకచకా జరిగిపోతున్నదని నేతలు బలంగా నమ్ముతున్నారట. పార్టీ ఆఫీసు వద్ద కన్నా అమ్మ ఇంటి వద్దే ఎక్కువ సందడి ఉంటున్నదని ఆ పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు.
అంచెలవారీ నాయకత్వం కలిగిన ఆ పార్టీలో ఆమెది కీలక పదవి. సాధారణంగా అలాంటి స్థాయిలో ఉండేవాళ్లు.. పార్టీ బలోపేతం కోసమో, సమస్యలు చక్కబెట్టేందుకో అప్పుడప్పుడు ఢిల్లీ దూతగా వస్తుంటారు. కానీ ఆమె రూటే సెప’రేటు.’ చేసుకోవడానికి ఇక్కడ చాలా ‘పని’ ఉన్నప్పుడు ఇక్కడే మకాం వేస్తేనే గిట్టుబాటు అవుతుందని అనుకున్నారేమో! అందుకే నెలకు రూ 6 లక్షల అద్దెతో జూబ్లీహిల్స్‌లో ఓ బంగ్లా తీసుకున్నారు. ఇక్కడే ఉండి పార్టీ పనుల్లో తలమునకలయ్యారని అనుకుంటే పొరపాటే. అమ్మగారు హైదరాబాద్ కేంద్రంగా సమాంతర పాలన నడిపిస్తునారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆమె ఇంటి వద్ద రోజూ కనిపించే సందడే ఇందుకు నిదర్శనమని సొంత పార్టీకి చెందిన ఓ సీనియర్‌నేత వ్యాఖ్యానించారు. పార్టీలో ఇప్పుడంతా ఆమె మాటే నడుస్తున్నదని, ఆమె దయ ఉంటే పనులు సులువుగా జరుగుతాయని తెలిపారు. అమ్మగారిని కలసి ‘ప్రసన్నం’ చేసుకున్న వారికి పదవులు దక్కేలా సహకరిస్తారని, లేకపోతే కొర్రీలు పెట్టి అడ్డుకుంటారని వాపోయారు. రోజూ ఆమె ఇల్లు లాబీయిస్టులతో కిటకిటలాడుతున్నది. పదవులైనా, పైరవీలైనా, పోస్టులైనా, బదిలీలైనా కేరాఫ్ జూబ్లీహిల్స్ అన్నట్టు తయారైందని, రోజూ మూడు పోస్టులు, ఆరు పైరవీలుగా సమాంతర పాలన నడుస్తున్నదని వివరించారు.
రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్ఠానం ప్రతినిధి అభిప్రాయం తీసుకోవడం ఆ పార్టీలో తప్పనిసరి. వివాదాస్పదమైన వ్యక్తి, లెక్కలేనితనంతో వ్యవహరించే ఓ నాయకుడికి ఆ మధ్యకాలంలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొద్దని ఇక్కడి నేతలు అంతర్గత నిర్ణయం తీసుకున్నారట. విషయం తెలిసిన సదరు వ్యక్తి నేరుగా అమ్మగారిని కలసి, ‘ప్రసన్నం’ చేసుకొవటంతో ఇక్కడి వాళ్లతో సంబంధం లేకుండా నేరుగా అక్కడి నుంచి టికెట్ ఇప్పించారని ప్రచారం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఒకరికి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరొకరికి అమ్మగారే టికెట్ ఇప్పించారని తెలిసింది.
నామినేటెడ్ పోస్టుల భర్తీ సీజన్ త్వరలో మొదలు కానుందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ఇంకేముంది ఆశావహులు ఆమెను ‘ప్రసన్నం’ చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫారసు లేఖలు ఉన్నా లేకున్నా, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసినా చేయకపోయినా.. ఇవేమీ అమ్మగారి దృష్టిలో పెద్ద విషయాలు కాదట. అమ్మవారికి ముడుపులు కట్టి ప్రసన్నం చేసుకుంటే పోస్టులు ఇప్పిస్తున్నారని సొంత పార్టీ నేత బహిరంగంగానే చెప్తున్నారు. అమ్మవారి సన్నిధానంలో పోస్టు స్థాయిని బట్టి దర్శనం టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుందని చమత్కరిస్తున్నారు.
వీటి ధరలు రూ.25 లక్షల నుంచి కోట్లలో ఉంటాయని తెలిపారు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు నామినేట్ పోస్టులను భర్తీ చేయాలని ఆ పార్టీ స్థానిక పెద్దలు భావించారని, ఆ విషయంలో ఆమె జోక్యం చేసుకోవడం వల్ల పదవుల భర్తీ పదే పదే వాయిదా పడుతూ వస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలు చేస్తున్నది చిన్నాచితకా స్థాయి నేతలు కాదు. కీలక పదవుల్లో నేతలే అమ్మగారి లీలల గురించి సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ వాపోతున్నారట. ఇటీవల నోటి దురుసుతో వివాదాల్లో చిక్కుకున్న ఓ మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ జూబ్లీహిల్స్ అమ్మగారిని అనుగ్రహం ద్వారా అధిష్ఠానం ఆగ్రహం నుంచి సదరు మంత్రి ఉపశమనం పొందారని తెలుస్తున్నది.
రాష్ట్రంలో ముఖ్యనేతకు సమాంతరంగా మరో పవర్ సెంటర్‌గా మారుతున్నప్పటికీ కీలక నేతలు కూడా నోరుమెదపలేని పరిస్థితి నెలకొన్నదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పాలనలోనూ తలదూర్చుతూ ఉంటే ఇంకా ఏం మాట్లాడుతామని నిర్ఘాంతపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఫోన్ చేసి, పని ఎంతవరకు వచ్చింది? త్వరగా పూర్తి చేయండి? అంటూ అమ్మగారు ఆర్డర్లు వేస్తున్నారట. ఉద్యోగుల బదిలీల్లోనూ ఆమె జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారిందని తెలుస్తున్నది.
ముఖ్యంగా కాంట్రాక్టర్లు జూబ్లీహిల్స్ అమ్మ దగ్గరకు వెళ్లి, పెండింగ్ బిల్లులు మంజూరు అయ్యేలా కరుణంచండి మాతా అని వేడుకుంటున్నారట. సాధారణంగా బిల్లులు ఇప్పించే పనులను ముఖ్యనేత, ముఖ్యనేత అనుచరులు, కొందరు కీలక మంత్రులు 8 నుంచి 10శాతం కమీషన్ తీసుకుని చేస్తారని ప్రచారం ఉంది. కానీ అమ్మ సన్నిధానంలో మాత్రం 4 నుంచి 6శాతం దక్షిణ సమర్పించుకుంటే సరిపోతుందని తెలుస్తున్నది. కస్టమర్ల నుంచి గిరాకీ తీసుకురావడానికి ప్రత్యేకంగా ఓ భక్త బృందాన్ని కూడా అమ్మగారు ఏర్పాటు చేసుకున్నట్టు పార్టీ ఆఫీసు వర్గాల్లో బహిరంగానే చర్చ జరుగుతున్నది.