హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : మహిళా పోలీసు అధికారులే పోలీసు స్టేషన్లలో బాధితులుగా మారే పరిస్థితులను మనం చూస్తున్నామని, ఇటువంటి దారుణ స్థితి కొనసాగొద్దంటే మహిళా పోలీసుల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని గ్రామీణ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్ను కోరారు. పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా పోలీసు అధికారుల రాష్ట్రస్థాయి తొలిరోజు సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళా అధికారుల ఆరోగ్యం కోసం, మానసిక ఒత్తిడిని తగ్గించేలా కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్త్ మొదటి మహిళా పోలీస్ అధికారుల రాష్త్రస్థాయి సదస్సు లక్ష్యాలను, ముఖ్యాంశాలను వివరించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి అధికారులందరూ ఐదు గ్రూపులుగా ఏర్పడి నివేదికను రూపొందించి సీఎంకు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు స్వాతిలక్రా, బాలనాగదేవి, చారుసిన్హా, రెమా రాజేశ్వరీ, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కవిత, ఎస్పీలు పాల్గొన్నారు.
భవనాల పనుల్లో వేగం పెంచాలి
అంగన్వాడీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. 1,025 భవనాలు నిర్మించాలని నిర్ణయించగా 625 చోట్లనే స్థలాలు గుర్తించారని తెలిపారు. స్థలాల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సెంటర్లలో మౌలిక వసతుల కల్పన, అంగన్వాడీ, ఆరోగ్యలక్ష్మి, మిషన్ వాత్సల్య, టీచర్లు, హెల్పర్లకు యూనిఫాం చీరెల పంపిణీ, బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం తదితర కార్యక్రమాల పురోగతిని మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టే బ్రేక్ఫాస్ట్ స్కీంను త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు.