Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో చోటు చేసుకుంటున్న నేర ఘటనల వెనుక నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం విధ్వంసంపై స్థానికులు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన వారు ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదులు చేసినా స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో 140 మంది వివిధ రాష్ర్టాల నుంచి సికింద్రాబాద్ వచ్చి కొన్ని రోజులుగా బస చేస్తున్నారు.
ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున వసూలు చేసి ఆలయానికి సమీపంలోని హోటల్లో ఆశ్రయమిచ్చారు. వీళ్లందరికీ మోటివేషన్ క్లాసెస్ పేరుతో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పడం, అందులో మతపరమైన అంశాలపై బోధించడంతో పాటు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తున్నారని, మతోన్మాదం వైపు రెచ్చగొట్టే కుట్ర జరుగుతున్నదన్న వాదనలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎస్బీ, ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులెవరూ కొత్తవాళ్లు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ హోటల్‌పై దాడిచేసి కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నిందితుడు కూడా వీరిలో ఒకడు కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.