హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల, విపత్తు నిర్వహణ, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో రాష్ట్ర భద్రతలో కవచంగా తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. అటువంటి వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు, పరిపాలన సెక్షన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, కార్యాలయ నిర్వహణ, ఇతర మౌలిక వసతులు పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన ప్రజెంటేషన్ పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసిందని తెలిపారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ‘మిత్ర’ కౌన్సెలింగ్ కేంద్రాలను సమర్థంగా వినియోగించాలని సూచించారు. డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ బారిన సిబ్బంది ఎవరూ పడకుండా అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.