Assembly | హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై నిర్ణయించిన విషయం తెలిసిందే. సభ ఉదయం 10గంటలకు ప్రారంభం కానుండగా, సభ్యులంతా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోవడంతోపాటు నివాళులర్పించనున్నారు.
అనంతరం సభ నిరవధిక వాయిదా పడనున్నది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తన మేథస్సుతో గట్టెక్కించడమే కాకుండా పదేండ్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో చిరస్మరణీయ పథకాలను అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తుచేస్తూ ఘనంగా నివాళి అర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నది.