హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘సేవ్ ది కానిస్టిట్యూషన్’ నినాదం కేవలం మాటలకేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం ఇచ్చిన తీర్పుపై హరీశ్ స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్లా నియమాలను పూర్తిగా పకన పెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమనేది రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధికరించడం, ఇదీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నిజస్వరూపమని దుయ్యబట్టారు. ‘సేవ్ ది కానిస్టిట్యూషన్’ నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు.
ఆధారాలు లేవనడం విడ్డూరం : సిరికొండ
పార్టీ ఫిరాయింపు కేసులో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడం రాజ్యాంగం నిర్దేశించిన యాంటీడిఫెక్షన్ చట్టానికి తూట్లు పొడవడమేనని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. పార్టీ ఫిరాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవనడం హాస్యాస్పదంగా ఉన్నదని, కళ్లుండీ చూడలేని కబోధిలా అనే సామెత ఈ ఘటనలో అక్షరాలా నిజమవుతున్నదని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా వారు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ బుకాయించడం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపుపై నిర్ణయం తీసుకునే విషయంలో కాలయాపన చేయకుండా నిర్ణీత గడువులోపు స్పీకర్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాలు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఢిల్లీలో రాజ్యాంగ విలువలపై పేజీలకు పేజీలు ఉపన్యాసాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. పార్టీ ఫిరాయింపుపై, రాష్ట్రంలో మంటగలుస్తున్న రాజ్యాంగ విలువలపై నోరేందుకు విప్పడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్సే చంపింది : వినోద్‌కుమార్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆ గ్రహం వ్యక్తంచేశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు స్వయంగా ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారని చెప్పారు. అందుకు భిన్నంగా వారు పార్టీ మారలేదని స్పీకర్ ప్రకటించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. 10వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలని, పార్టీ ఫిరాయింపుపై పార్లమెంట్లో వెంటనే ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, భర్త రాజీవ్‌గాంధీ హయాంలో చేసిన చట్టం పనికి మాలిందని తేల్చారంటూ విమర్శించారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపు చట్టం 10వ షెడ్యూల్‌ను పనికి మాలిన చట్టంగా స్పీకర్, ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పిందని మండిపడ్డారు. ‘పార్టీ ఫిరాయించవచ్చు కానీ, స్పీకర్ దగ్గర పార్టీ ఫిరాయించలేదు అని చెప్తే సరిపోతుంది.. అని అర్థమయ్యే విధంగా స్పీకర్ ప్రసాద్ తన తీర్పు ఇచ్చారు’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని అదే కాంగ్రెస్ చంపేసిందని మండిపడ్డారు.
స్పీకర్‌నూ ప్రభావితం చేసిన కాంగ్రెస్ : రామచందర్‌రావు
తెలంగాణలో రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఊహించిందేనని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను కూడా కాంగ్రెస్ ప్రభావితం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిరాయింపును ప్రోత్సహించబోమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే చెప్తుంటారని, ఆయన మాటలనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.