నిజామాబాద్ : చట్టసభల రాజ్యాంగ హక్కులను రక్షించాల్సిన అసెంబ్లీ స్పీకర్ భక్షకుడుగా మారడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) ఆరోపించారు. స్పీకర్ జడ్జిమెంట్ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ( Speaker Gaddam Prasad Rao ) తీర్పునివ్వడం రాష్ట్ర చట్టసభల గౌరవాన్ని దిగజార్చిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయింపు చేసినప్పటికీ, అనర్హత వేటు వేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా మారిందని అభిప్రాయ పడ్డారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా ఉన్నా, దాన్ని అమలు చేయడంలో స్పీకర్ నిర్లక్ష్యం, ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అవలంబిస్తున్న ఈ అనైతిక రాజకీయ విధానం ప్రజలు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని దుయ్యబట్టారు.
బిఆర్ఎస్ బీ ఫామ్ కింద గెలిచి, మంత్రిగా ఉన్నత పదవులు అనుభవించి, కాంగ్రెస్ పార్టీ లోకి ఫిరాయించిన పోచారం తాను బీఆర్ఎస్ కొనసాగుతున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. నిజంగా బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు తన చిత్తశుద్ధిని చాటాలని డిమాండ్ చేశార. జీవిత చరమాంకంలో ఉన్న విలువ తీసుకోవద్దని పోచారానికి హితవు పలికారు.
బీసీ లకు కాంగ్రెస్ మరోసారి ద్రోహం
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా ముందుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీ లను మరోసారి వంచించిందని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం మరో ప్రజావ్యతిరేక నిర్ణయంగా మారిందని ఆరోపించారు. బీసీ వర్గాల హక్కులను కాలరాసేలా తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు.
బీసీ వర్గాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, వారి ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారతాయని, కాంగ్రెస్ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానానికి బీసీ లు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.