Telangana Assembly | హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో అసెంబ్లీలోని కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సమావేశంలో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహా చార్యులు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, డీజీపీ అంజనీ కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ కమిషనర్ స్టిఫేన్ రవీంద్ర, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర శాసనసభ పనితీరు అద్భుతంగా ఉన్నదని ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ఈ ఘనత అధికార యంత్రాంగం సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరమున్నదన్నారు. మనమందరం ప్రజలకు జవాబుదారీ అని స్పీకర్ పేర్కొన్నారు.
గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని స్పీకర్ పోచారం కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందిస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేస్తుందని స్పీకర్ అన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయన్నారు. సభ్యులు సజావుగా శాసనసభకు చేరుకోవడానికి రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు స్పీకర్.