బాన్సువాడ టౌన్, అక్టోబర్ 23: దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని కొయ్యగుట్ట పీఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంతోపాటు మండలానికి చెందిన లబ్ధిదారులకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బిల్లులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎంత సేవ చేశామనేదే తరతరాలకు గుర్తుంటుందని పేర్కొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు కాలనీల్లో మౌలిక సదుపాయాలకు సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ హడ్కో నుంచి వెయ్యి కోట్ల రుణం తీసుకొచ్చి అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల కోసం రూ. 120 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా, మొదటి విడుతగా రూ. 50 కోట్లు, ఇటీవల రెండో విడుతగా మరో రూ.18 కోట్లు వచ్చాయని వివరించారు. మిగతా నిధులు విడుతల వారీగా దీపావళి పండుగ తరువాత విడుదలవుతాయని చెప్పారు. బిల్లులు అందుకున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు.
అందరూ అలాగే పిలుస్తున్నారంటున్న స్పీకర్ పోచారం
బాన్సువాడ టౌన్, అక్టోబర్ 23: ‘నన్ను అందరూ డబుల్ బెడ్రూం శ్రీనివాసరెడ్డి’ అని పిలుస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో తనను పోచారం శ్రీనివాసరెడ్డికి బదులు డబుల్ బెడ్రూం శ్రీనివాసరెడ్డి అని పిలుస్తున్నారని తెలిపారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటివరకు పదివేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా, ఇందులో ఇప్పటికే ఐదు వేల ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయి గృహ ప్రవేశాలు కూడా చేసుకున్నారని తెలిపారు. ఇండ్ల నిర్మాణంతో పాటు అవసరమైన రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా డబుల్ బెడ్ ఇండ్లు మంజూరైన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని పేర్కొన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో తనను పోచారం శ్రీనివాసరెడ్డికి బదులు డబుల్ బెడ్రూం శ్రీనివాసరెడ్డి అని పిలుస్తున్నారని చమత్కరించారు. త్వరలో మూడు లక్షల రూపాయల ఇండ్ల నిర్మాణం పథకం రానున్నదని తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను అందిస్తామన్నారు. అనంతరం బిల్లులు అందుకున్న బాన్సువాడ మండలం పరిధిలోని మహిళలు సభాపతిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ కె. జగన్నాథరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ, బుడ్మి సొసైటీ చైర్మన్లు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, జడ్పీటీసీ పద్మాగోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భూషణ్‌రెడ్డి, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురు వినయ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, బాన్సువాడ మండల పరిధిలోని పలు గ్రామాల సర్పంచులు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.