వర్ని, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో పల్లెప్రగతి ద్వారా పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్‌లో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలోని రామాల యం వద్ద భక్తుల సౌకర్యార్థం దాసరి వెంకటరత్నం-వెంకటరత్నమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రామకృష్ణ నిర్మించిన భోజనశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. 500పైగా జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించి, వాటి అభివృద్ధికి ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. గ్రామ పంచాయతీ, పాఠశాల భవనాలు నిర్మించి గ్రామాల్లో కనీస సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారని వివరించారు. కాగా.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పసుపుల ఎల్లబోయి ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. అతడికి బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో పార్టీ ద్వారా రూ. 2 లక్షల బీమా చెక్కు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కును మృతుడి భార్య సాయవ్వకు స్పీకర్ పోచారం అందజేశారు.