హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్‌ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీచేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్టు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. వీరిలో ఎనిమిది మంది సమాధానం ఇవ్వగా, వారిపై విచారణ కొనసాగుతున్నది. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు.
మరింత సమ యం కావాలని స్పీకర్‌ను కోరారు. అయితే, పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు ఇటీవలే సీరియస్ అవడంతోపాటు నాలుగు వారాలు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు జారీచేశారు.