హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ) : మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించి మానసికంగా క్షోభ పెట్టినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతోపాటు వారం రోజుల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని మీడియా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. లేకపోతే చట్టం ప్రకారం న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ నెల 14, 19 తేదీల్లో మీడియా సమావేశాల్లో ఆనంద్ తనపై తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టు కథలతో కూడిన అవినీతి ఆరోపణలు చేశారని నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తాను వందల కోట్లు లంచం తీసుకున్నానని ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజ్యాంగబద్ధ్దమైన పదవిని అవమానించడమేనని పేర్కొన్నారు. భారతీయ న్యాయసంహిత 2023లోని సెక్షన్ 499, 500 ప్రకారం దురుద్దేశ ఆరోపణలు చేసినవారు శిక్షార్హులని తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి స్పీకర్ హోదాలో ఉండి, వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తున్న తనపై అసత్య ఆరోపణలు చేయడం వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు.