Gangula Kamalakar | ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కిరణ్‌కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్‌గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయని అప్పటి స్పీకర్ మనోహర్ తమకు సమయం ఇచ్చేదని గుర్తుచేశారు. కానీ నిన్న అసెంబ్లీలో స్పీకర్ తీరు బాధాకరమని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నిర్బంధం చేయలేదని.. మా గొంతు నొక్కలేదని గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పంటలను అసెంబ్లీకి తీసుకొనిపోయామని గుర్తుచేశారు. పక్షపాత వైఖరితో ఉండకండి అని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హితవు పలికారు. మీ వ్యవహర శైలిని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో అందే అందరు సభ్యులకు ఉంటుందని తెలిపారు. మా హక్కుల కోసమే మాట్లాడామని చెప్పారు.
నిన్న అసెంబ్లీలో గిల్లికజ్జాలు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూశాడని గంగుల కమలాకర్ అన్నారు. మమ్మల్ని తిట్టేందుకే సభకు వచ్చాడని, కడుపునిండా తిట్టి వెళ్లాడని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి రెండు గంటలు మాట్లాడతాడా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎజెండా కూడా పొద్దున రెండుగంటలకు ఇస్తారా అని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడటానికి నేను, జగదీశ్ రెడ్డి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వమని చెప్పడమేంటని స్పీకర్‌పై గంగుల కమలాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మేం భజన చేయాలా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ హుందాగా నడిచిందని తెలిపారు. గత స్పీకర్ ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇచ్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుత స్పీకర్ బీఆర్ఎస్ సభ్యుల గొంత నొక్కేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా, రేవంత్ ప్యాలెస్‌లా నడిపిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి భజన చేసేందుకు అసెంబ్లీకి వెళ్లాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, సీఎం సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు.